Politics

జనసేన టిక్కెట్ కావాలా… ఈ ఎగ్జామ్ పాస్ అవ్వండి

ఎన్నికలు ఇక దగ్గర పడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మార్చిలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందన్న మాట వినిపిస్తోంది. దీంతో అన్ని రాజకీయ పక్షాలు తమ వ్యూహానికి పదును పెడుతున్నారు. ఇక గత ఎన్నికల్లో పోటీకి దూరంగా నిల్చి కేవలం టీడీపీ,బిజెపిలకు మద్దతిచ్చిన జనసేన ఇప్పుడు అన్ని సీట్లకు పోటీచేయాలని రంగం సిద్ధం చేసుకుంటోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంతో మమేకం అవుతూ యాత్రల పేరిట తిరుగుతున్నారు. ఆయా పార్టీల నుంచి నాయకులు,కార్యకర్తలు కూడా జనసేనలోకి జంప్ చేస్తున్నారు.

పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక ఏపీలోని 175అసెంబ్లీ,25లోకసభ స్థానాల్లో అభ్యర్థులను పోటీ పెట్టడానికి అవసరమైన ప్లాన్ రూపొందిస్తున్నారు.ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఆశించేవాళ్ళు తమ బయోడేటాతో దరఖాస్తులు చేస్తున్నందున ఎక్కడెక్కడ ఎంతబలం ఉంది, ఎవరిని పోటీకి దింపాలి వంటి విషయాలపై యోచన చేస్తున్నారు.

వీలైనంత మేరకు కొత్తవారిని రంగంలో దింపాలని పవన్ ఆలోచిస్తున్నారట. ఈమేరకు సంప్రదింపులు కూడా చేస్తున్నట్టు బోగట్టా. ఇక అభ్యర్థిత్వం ఆశించేవారికి సదరు నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నలను పవన్ సంధిస్తూ పరీక్ష పెడుతున్నారట. దరఖాస్తు దారులతో విజయవాడ పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది.

మరోపక్క పలుకుబడి గల నాయకుల కోసం జనసేన ఎదురుచూస్తోంది. ఎందుకంటే షెడ్యూల్ విడుదలయ్యాక ఇతర పార్టీల నుంచి జనసేనలోకి పలువురు ప్రముఖులు వస్తారని అంటున్నారు. ఇక స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మాదాసు గంగాధరం,హరిప్రసాద్, మహేంద్రరెడ్డి లతో కూడిన కమిటీ అప్లికేషన్స్ ని నిశితంగా పరిశీలిస్తోంది. ఆతర్వాత వీటిని పవన్ దృష్టికి తీసుకెళ్తారు. ఏది ఏమైనా పూర్తి వడపోత తర్వాత ఎక్కువగా కొత్తవారికి ఛాన్స్ కల్పించాలన్న యోచన చేస్తున్నారట.