రవితేజ కెరీర్ ను మలుపు తిప్పిన అరుదైన కాంబినేషన్లు
సినిమాల మీద ఉన్న పిచ్చితో తన స్వశక్తి తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే మాస్ మహారాజ్ ట్యాగ్ లైన్ తన పేరులో చేర్చుకున్న నటుడు ఎవరంటే రవితేజ అని చెప్పాలి. 1968 జనవరి 26 న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో పుట్టిన రవితేజ అసలు పేరు రవి శంకర్ రాజు భూపతిరాజు. తనదైన ప్రత్యేక డైలాగ్ డెలివరీతో ఇప్పటివరకు 60 సినిమాలలో అలరించాడు. కెరీర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసి, మధ్య మధ్యలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధూరం’సినిమాతో హీరోగా మారాడు.’కర్తవ్యం’,’వారసుడు’,
‘అల్లరి ప్రియుడు’, ‘అన్నయ్య’, ‘నిన్నే పెళ్లాడుతా’, ‘సీతారామరాజు’ వంటి సినిమాలో సపోర్టింగ్ రోల్స్ తో చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలసి చేసాడు.

అయితే రవితేజ కెరీర్ ని మలుపుతిప్పిన కీలక కాంబినేషన్స్ కొన్ని వున్నాయి. అవి ఏమిటో చూద్దాం. కృష్ణవంశీ 1997లో తెరకెక్కించిన ‘సింధూరం’ సినిమా రవితేజ కెరీర్ ను మలుపుతిప్పింది. ఈ సినిమాకైతే అవార్డులు, రివార్డ్ లు వచ్చాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ ఎదురైంది. రవితేజ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ కాంబినేషన్ ‘ఖడ్గం’ సినిమాతో రిపీట్ అయింది. ‘నీ కోసం’ సినిమాతో మొదలెట్టి ఇద్దరూ కలసి ఇప్పటివరకు 4 సినిమాలతో అదరగొట్టారు. ‘నీ కోసం’ మ్యూజికల్ హిట్ గా నిలిచి 5 నంది అవార్డులను దక్కేలా చేసింది.

ఇక ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ తో మొదలుకుని ‘దేవుడు చేసిన మనుషులు’ వరకు రవితేజతో కలసి 5 సినిమాలు పూరి జగన్నాధ్ తెరకెక్కించాడు. ఇందులో ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రాలు రవితేజను స్టార్ హీరోగా మార్చాయి. ‘నేనింతే’ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఈ సినిమాకు 3 నంది అవార్డులు వచ్చాయి.

తరువాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ చిత్రాలతో రవితేజ లోని కమెడియన్ ను ప్రేక్షకులను పరిచయం చేశాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ కావడంతో ఈ కాంబినేషన్ తిరిగి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తో రిపీట్ అయింది. అయితే ఈ సినిమా ఆశించినంత సక్సెస్ అందుకోలేదు.

రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంతో అలరించి, మాస్ హీరోగా ఎదిగాడు. ఇక ఈ సినిమా ఇద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.

‘విక్రమార్కుడు’ తరువాత సరైన హిట్ లేని రవితేజకి దర్శకుడు సురేందర్ రెడ్డి ‘కిక్’ మూవీతో ఊపు నిచ్చాడు. ఈ సినిమాలో రవితేజ తన నటనతో నవ్వుల పూవులని పూయించారు. అయితే ఈ సినిమా కి సీక్వెల్ గా తీసిన ‘కిక్ 2’ సినిమా బోల్తా కొట్టింది. ఇక ‘షాక్’,’అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘నా ఆటోగ్రాఫ్’, ‘శంభో శివ శంభో’ ..ఇలా ఎన్నో చిత్రాలు మాస్ మహారాజ్ కు పేరు తెచ్చాయి.

2015 లో వచ్చిన ‘బెంగాల్ టైగర్’ చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకున్న రవితేజ తిరిగి ‘రాజా ది గ్రేట్’ సినిమాతో కంబ్యాక్ అయినప్పటికీ ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలతో మళ్ళీ నిరాశలో పడ్డాడు. మళ్ళీ పూర్వ వైభవం కోసం రవితేజ శ్రమిస్తున్నాడు. డిస్కో రాజా, ఎవడో ఒకడు మూవీస్ రాబోతున్నాయని చెబుతున్నారు.

