Movies

సుకుమార్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు… కెరీర్ లో తక్కువ సినిమాలు చేయటానికి కారణం?

లెక్కల మాస్టర్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో అందుకు సుకుమార్ నిదర్శనం. 2004లో ఇతని మొదటి చిత్రం అల్లు అర్జున్ తో ఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ ని స్టార్ గా నిలబెట్టింది. రెండవ చిత్రం హీరో రామ్ తో జగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా రంగస్థలం మూవీతో రికార్డులు తిరగరాసాడు. 1970జనవరి 11న తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా మట్టపర్రు గ్రామంలో తిరుపతి నాయుడు, వీరవేణి దంపతులకు జన్మించాడు. మొత్తం ఆరుగురు సంతానంలో సుకుమార్ చిన్నవాడు. తండ్రి వ్యవసాయం చేయడమే కాదు, బియ్యం వ్యాపారం చేసేవారు. తల్లి గృహిణి. చిన్ననాటినుంచి పుస్తకాలు బాగా చదవడం అలవాటు.

కవితలు కూడా రాసేవాడు. రాజోలులో ఇంటర్ వరకూ చదివిన సుకుమార్ ఇంటర్ లోనే గణితం,ఫిజిక్స్ మీద ట్యూషన్ లో పట్టు సాధించి జూనియర్స్ కి ఈ సబ్జెక్ట్స్ లో డౌట్స్ క్లారిఫై చేసేవారు. బీఎస్సీ డిగ్రీ పూర్తయ్యాక మిత్రులతో కల్సి ఇంటర్ స్టూడెంట్స్ కి ట్యూషన్ చెప్పాలని ట్యూషన్ సెంటర్ పెట్టారు. సుకుమార్ మ్యాథ్స్, ఫిజిక్స్ చెబితే, మిత్రుడు కెమిస్ట్రీ చెప్పేవాడట. ఆ విధంగా10మంది స్టూడెంట్స్ తో మొదలై 400మందికి చేరింది. ఇలా రెండేళ్లు గడిచాక కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా మంచి జీతం తో ఉద్యోగం రావడం,అది చేస్తున్న సమయంలో సినిమాల్లోకి వెళ్లాలనే పట్టుదల పెరగడం జరిగాయి.

ఆరేళ్ళు లెక్కల మాస్టర్ గా మంచి పేరు సంపాదించిన సుకుమార్ సినీ రంగంపై ఉన్న ఆసక్తితో 2000 లో తన తండ్రితో మాట్లాడి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పని చేశాడు. 2004లో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన ఆర్య సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా మంచి విజయవంతం అయ్యింది. అలా మొదలైన సినీ ప్రయాణంలో రెండవ చిత్రం హీరో రామ్ తో చేసాడు.
మూడవ చిత్రం ఆర్య 2 అల్లు అర్జున్ తో తీసినా ఆకట్టుకోలేదు.

నాల్గవ చిత్రం 100% లవ్ నాగ చైతన్య అక్కినేని సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని నమోదు చేసింది. అందులోని పాటలు ప్రజాదరణ పొందాయి.2014 లో మహేష్ బాబు తో 1 నేనొక్కడినే చిత్రాన్ని కొత్తదనంతో తీసినా అది కూడా డిజాస్టర్ అయింది. ఆతర్వాత తండ్రి చనిపోవడంతో నాన్నకు ఓ సినిమా అంకితం చేయాలన్న లక్ష్యంతో 2016 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా సుకుమార్ కి మంచి విజయాన్ని నమోదు చేసింది. విదేశాల్లో కూడా అత్యధిక వసూళ్లు చేసిన ఈ సినిమాకు సుకుమార్ సైమా అవార్డు అందుకున్నాడు.

2018 లో రాం చరణ్ తేజ్ తో రంగస్థలం సినిమా తో తన కెరీర్ లో భారీ విజయాన్ని నమోదుచేసుకుని అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నాడు. కాగా కుమారి 21ఎఫ్ మూవీ కి సుకుమార్ మిత్రుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా,సుకుమార్ కథ ,స్క్రీన్ ప్లే అందించాడు. రాజ్ తరుణ్,హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇక ఆర్య సినిమా తీస్తున్న సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సుదర్శన్ థియేటర్ దగ్గర తనకు తెల్సిన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆవిధంగా మొదలైన ప్రేమ మూడేళ్లు గడిచాక ఇంట్లో ఒప్పించి సుకుమార్,సబితా 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు,ఒక కుమార్తె ఉన్నారు.