పూరి జగన్నాధ్ కొడుకు కోసం అంతలా డెసిషన్ తీసుకున్నాడా?
హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఒక రేంజ్ లో దూసుకుపోయే దర్శకుల్లో పూరి జగన్నాధ్ ఒకడు. టాలీవుడ్లో ఎందరో హీరోలకు తిరుగులేని హిట్లు ఇచ్చాడు. ముఖ్యంగా రవితేజ హీరోగా నిలదొక్కు కున్నాడంటే అందుకు పూరి కారణం అని చెప్పక తప్పదు. అంతెందుకు మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ పూరీతోనే అందుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాపుల పరంపర విడిచిపెట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది పూరి చిత్రంతోనే. ఇంకా మరికొందరు హీరోలకు మరపురాని విజయాలు అందించాడు. అలాంటి దర్శకుడు పూరి తన కొడుకు పూరి ఆకాశ్‌ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయాడు.
ఆల్రెడీ టీనేజీలో చేసిన ‘ఆంధ్రాపోరి’తో ఎదురు దెబ్బ తిన్న ఆకాశ్‌ను ‘మెహబూబా’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయం చేస్తే,ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో కొడుకుతో వరుసగా ఇంకో రెండు సినిమాలు తీయాలన్న ప్లాన్ పక్కకు పోయింది. తాను ఫాంలో లేని విషయాన్ని అంగీకరించి కొడుకును తన శిష్యుడైన అనిల్ పాడూరి చేతికి అప్పగించగా, అది ప్రస్తుతం చివరి దశ షూటింగ్లో ఉంది. ‘రొమాంటిక్’కు కూడా పూరీనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తుండటంతో ఇది ఏమాత్రం విజయవంతం అవుతుందో అనే అనుమానం పీకుతోంది. ఇప్పటికైతే ఈ చిత్రానికి బజ్ లేదు.ఇక ఆకాశ్ మూడో ప్రాజెక్టు అయినా సరైనదే సెట్ అవుతుందేమో అనుకుంటే, పూరి ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు టాక్.
నందమూరి కళ్యాణ్ రామ్‌తో ‘అభిమన్యు’, ‘కత్తి’, ‘షేర్’ లాంటి ఫ్లాప్ సినిమాలు తీసిన మల్లికార్జున్‌తో ఆకాశ్ మూడో సినిమా ఉంటుందట. కళ్యాణ్ రామ్, మల్లికార్జున్‌ను ఎంతగానో నమ్మి ఒకటికి మూడు సినిమాలు చేశాడు. అతడికి హిట్ ఇవ్వాలని తపించాడు. కానీ అతడి ప్రయత్నం ఫలించలేదు. మల్లికార్జున్ చివరగా తీసిన ‘షేర్’ అయితే మరీ పేలవంగా ఉండి అతడి కెరీర్‌కు దాదాపు తెరదించినట్లే కనిపించింది. కానీ అతను పూరిని మెప్పించి ఆకాశ్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడని టాక్ . కళ్యాణ్ రామ్‌కు ‘ఇజం’ అనే కాస్ట్లీ ఫెయిల్యూర్ కట్టబెట్టిన పూరి, అతడి రెకమండేషన్తోనే మల్లికార్జున్‌కు అవకాశం ఇస్తున్నాడనుకోవాలా ఇంకోలా అర్ధం చేసుకోవాలా?

