Sports

వరల్డ్‌కప్‌లో అతనే భారత్‌కి కీలకం: యువీ

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్య ప్రదర్శనే భారత్‌కి కీలకమని వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2019 సీజన్‌లో తన పవర్‌ హిట్టింగ్‌తో స్లాగ్ ఓవర్లలో ముంబయి ఇండియన్స్ టీమ్‌‌కి భారీ స్కోర్లు అందించిన హార్దిక్ పాండ్య.. అదే జోరుని ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఒక బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా.. మూడో సీమర్‌గానూ టీమిండియాకి అతను ఉపయోగపడతాడని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్‌కి ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో టీమ్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. 

కెరీర్‌లో తొలి ప్రపంచకప్ ఆడబోతున్న హార్దిక్ పాండ్య గురించి తాజాగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘వరల్డ్‌కప్‌లో భారత్‌కి హార్దిక్ పాండ్య ప్రదర్శన చాలా కీలకం. అతను ఇటీవల హిట్టర్‌గా అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అదే విధంగా బౌలింగ్‌లోనూ టీమ్‌కి సాయపడగలడు. ఒకవేళ టీమ్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో ఆడాలనుకున్నప్పుడు.. హార్దిక్ పాండ్య.. మూడో పేసర్‌గా జట్టులో ఉంటాడు. దీంతో.. టీమ్‌లోనూ సమతూకం వస్తుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఇలానే అశ్విన్, జడేజాతో పాటు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లని తుది జట్టులోకి తీసుకున్నాం. ఐదో బౌలర్‌గా హార్దిక్ ఆడటం టీమ్‌కి లాభించింది’ అని యువరాజ్ సింగ్ వెల్లడించాడు.