శ్రీహరి చనిపోవడానికి వెనుక ఉన్న అసలు కారణం బయటపెట్టిన డిస్కో శాంతి

రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరణం తెలుగు సినిమా అభిమానులను షాక్‌కు గురిచేసింది. అయితే శ్రీహరి మరణం వెనక కారణం ఏమిటనే విషయంలో అభిమానుల్లో అనుమానాలు అలాగే ఉండిపోయాయి. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీహరి భార్య డిస్కో శాంతి ఆ రోజు ముంబైలో ఏం జరిగిందనే విషయం వెల్లడించారు. ‘ఆర్.. రాజ కుమార్’ మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన సమయంలో శ్రీహరి అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. లివర్‌కు సంబంధించిన సమస్యతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. శ్రీహరి మరణంపై డిస్కోశాంతి చెప్పిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

ఆ రోజు బావ షూటింగ్ పూర్తి చేసుకుని హోటల్‌కు వచ్చారు. అప్పుడే తిని టీవీ చూస్తున్నారు. సడెన్‌గా చెమటలు పడుతున్నాయి, అదోలా ఉందని చెప్పడంతో వెంటనే రిసెప్షన్‌కు ఫోన్ చేసి డాక్టర్‌ను పిలిపించాం. డాక్టర్ కాస్త లేటుగా వచ్చారు. చూసి ఏమీ లేదు ఒక ఇంజక్షన్ ఇస్తే సరిపోతుంది అన్నారు. ఆ లోపు మేకప్ మ్యాన్, స్టాఫ్ మొత్తం వచ్చారు. అప్పుడు నేను నైటీలో ఉన్నాను. లోనికి వెళ్లి బట్టలు మార్చుకుని కిందకు వెళ్లేలోపు బావను తీసుకుని బండి ఆసుపత్రికి వెళ్లిపోయింది. నేను ఆసుపత్రికి వెళ్లగానే … బావను ఐసీయూలో పెట్టి సెలైన్ ఎక్కిస్తున్నట్లు చెప్పారు. 

ఐసీయూ కాబట్టి నన్ను బయటకు పంపారు. నన్ను లోనికి పంపక పోవడంతో దొంగతనంగా దూరిపోయాను. బావ మొత్తం రక్తంతో నిండిపోయి ఉన్నారు. భయం వేసి వెంటనే అరిచాను. నాకేమో హిందీ రాదు… అంతా కలిసి నన్ను బయటకు తోశారు. బయటకు వచ్చి వెంటనే చెన్నైలో ఉన్న మా వాళ్లకు ఫోన్ చేశాను. నాకు భయంగా ఉందని చెప్పాను. వెంటనే మా చెల్లి లలితా ప్రకాష్ రాజ్, నా తమ్ముడు అరుణ్ అంతా వచ్చారు. అందరూ వెళ్లి చూసి వస్తున్నారు. నన్ను మాత్రం లోనికి పంపించడం లేదు. చివరకు రాత్రి 9 గంటలకు పంపారు. వెళ్లి చూస్తే బావ పూర్తిగా బ్లడ్‌తో ఉన్నారు. తట్టుకోవడం నా వల్ల కాలేదు. నన్ను మళ్లీ లాక్కుని బయటకు తీసుకొచ్చారు.

‘‘అక్కడి వారికి బావ ఎవరో తెలియదు. కొంత మంది డాక్టర్లు వచ్చి ఏదో తప్పు జరిగిందని బ్రతిమిలాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఆయనకు నోట్లో నుంచి ట్యూబ్ వేశారు. అది వెళ్లి లివర్లో గుచ్చేసింది. దీంతో మొత్తం బ్లడ్ బయటకు వచ్చింది. రూమ్ మొత్తం రక్తమే. హార్ట్ ఎటాక్ వస్తే అంత బ్లడ్ వచ్చే అవకాశమేలేదు. నేను వెంటనే బావ పర్సనల్ డాక్టర్లను పిలిపించాను. వాళ్లు నాకు ఈ విషయం చెప్పారు. పైపు వేసినపుడు ఈయన కదిలారో? వాళ్లు తప్పుగా పైపు వేశారో తెలియదు… నా బావ నాకు దూరమైపోయాడు” అంటూ డిస్కోశాంతి కన్నీటి పర్యంతం అయ్యారు.