అలనాటి హీరోయిన్ రాధ గుర్తు ఉందా…ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

తెలుగు సినీ రంగంలో మెగాస్టార్ డాన్స్ స్పీడ్ అందుకోగలిగిన ఏకైక హీరోయిన్ రాధ. 80,90 దశకాల్లో దక్షిణాది ప్రేక్షకులను తన అందచందాలతో ఆకట్టుకొంది. రాధ తెలుగు అమ్మాయి కాదంటే అప్పట్లో ఎవరు నమ్మలేదు. అంతలా తెలుగు అమ్మాయిలా మెప్పించింది. తమిళ సినిమా ద్వారా సినీ రంగానికి వచ్చిన రాధ తెలుగులో మొదటి సినిమా మిస్టర్ విజయ్.

ఆ తర్వాత చిరంజీవితో జోడి కట్టిన దాదాపుగా అన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించటమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామి సృష్టించాయి. తెలుగులోనే కాదు తమిళ,మలయాళ,కన్నడ సినీ రంగాలలో కూడా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. రాధ అసలు పేరు ఉదయచంద్రిక. 1966 జూన్ 3 న కేరళలో జన్మించింది. తండ్రి పేరు కుంజర్ నాయర్,తల్లి సరసమ్మ. సరసమ్మ కేరళలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు.

రాధకు అంబిక,మల్లిక అనే సోదరీమణులు,అర్జున్,సురేష్ అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వీరిలో అంబిక కూడా హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. చదువుకొనే రోజుల్లోనే దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడిన రాధ తోలి సినిమాలో హీరోగా కార్తీక్ నటించాడు. ఈ సినిమా కార్తీక్ కు కూడా మొదటి సినిమానే.

ఈ సినిమా హిట్ అవ్వటంతో రాధకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కమలహాసన్,ప్రభు వంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆ తర్వాత ఒక సంవత్సరంలో కార్తీక్ తో జోడిగా 5 సినిమాలు చేసి రికార్డ్ సృష్టించింది రాధ.

అదే సమయంలో తెలుగులో కూడా గోల్డెన్ లెగ్ అని అనిపించుకుని నిర్మాతల పాలిట కల్ప వృక్షంగా మారింది. ఆ రోజుల్లో రాధ ఉంటే సినిమా హిట్ అనే వాదన బలంగా వినిపించేది. ఎన్టీఆర్ తో చండశాసనుడు. ANR తో వసంతగీతం సినిమాలో నటించి హిట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.
ఆ తర్వాత చిరంజీవితో గుండా సినిమా చేసింది. ఆ తర్వాత చిరుతో నాగు,దొంగ పెళ్లి,అడవి దొంగ,కొండవీటి రాజా,రాక్షసుడు,జేబుదొంగ,యముడికి మొగుడు,మరణ మృదంగం,స్టేట్ రౌడీ,రుద్రనేత్ర,కొండవీటి దొంగ,కొదమ సింహం వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలను చేసింది.

రాధ,నందమూరి బాలకృష్ణ తో కూడా చాలా సినిమాలు చేసింది. వీరి కాంబినేషన్ లో నిప్పు లాంటి మనిషి,కలియుగ కృష్ణుడు,ముద్దుల క్రిష్నయ్య,రక్తాభిషేకం,దొంగ రాముడు ,రాముడు భీముడు వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.సినిమాల్లో మంచి పొజిషన్ లో ఉండగానే రాధ బంధువైన రాజశేఖర్ నాయర్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని ముంబైలో సెటిల్ అయింది రాధ. వీరికి కార్తికా నాయర్, తులసి నాయర్ అనే ఇద్దరు అమ్మాయిలు,విఘ్నేష్ అనే కొడుకు ఉన్నారు.

కార్తికా నాయర్, తులసి నాయర్ ఇద్దరు దక్షిణాదిలో హీరోయిన్ గా తమ కెరీర్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాధ పెళ్లి అయ్యాక నటనకు గుడ్ బై చెప్పేసింది. అప్పుడపుడు చెన్నై వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ని కలుస్తూ ఉంటుంది. రాధిక,విజయశాంతి,అనురాధ మంచి స్నేహితులు. అంతేకాకుండా సీనియర్ నటులు సంవత్సరానికి ఒకసారి ఎదో ఒక దేశంలో ట్రిప్ వేసుకొని కలుస్తూ ఉంటారు. ఈ ట్రిప్ కి రాధ క్రమంతప్పకుండా హాజరు అవుతుంది.

ప్రస్తుతం రాధ రెస్టారెంట్స్ ని చూసుకుంటూ ఉంది. ఆమె భర్తకు దేశవ్యాప్తంగా ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి. తీర ప్రాంతం ఉన్న ప్రతి నగరంలోనూ ఆయనకు రెస్టారెంట్స్ ఉన్నాయని చెప్పుతారు. పెళ్లి అయ్యాక భర్త,పిల్లలే లోకంగా బ్రతుకుతున్న రాధ సినీ వేడుకలకు ఆహ్వానిస్తే మాత్రం తప్పకుండా వస్తుంది.