Movies

పాపం.. ఈ హీరోలకి ఎంత కష్టం వచ్చిపడింది

హీరోయిన్స్ వయస్సు మీద పడితే ఇక హీరోయిన్ లుక్ పోయి,అమ్మ,వదిన పాత్రలకే పరిమితం అవ్వాలి. అదే హీరోలైతే ఎంత వయస్సు వచ్చినా హీరోగానే కొనసాగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి హీరోలకు పెద్ద కష్టమే వచ్చేసింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి వెటరన్ హీరోలకు హీరోయిన్ల సెలక్షన్ దర్శకులకు సవాల్ గా మారింది. అన్నీ రెడీగా ఉన్నా అనుకున్న టైమ్ లో హీరోయిన్లు దొరకడం లేదు. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ `ఖైదీ నంబర్ 150` కోసం ఎందరినో పరిశీలించి చివరికి కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేయడానికి వినాయక్ చాలా శ్రమించారు. అటుపై సైరా నరసింహారెడ్డి విషయంలో అంతే. కొత్త హీరోయిన్లు అందుబాటు లో ఉన్నా చిరు ఇమేజ్ దృష్ట్యా ఎంపిక చేయలేని పరిస్థితి నెలకొనడంతో సీనియర్ నాయిక కోసం వెయిట్ చేసి చివరికి నయనతార-తమన్నాలను కన్విన్స్ చేసారు.

అది అలా ముగిస్తే,ప్రస్తుతం మెగాస్టార్ 152వ సినిమా కథానాయిక సస్పెన్స్ గా ఉంది. హీరోయిన్ ఎవరన్నది డైరెక్టర్ కొరటాల శివ ఇంకా అధికారికంగా చెప్పలేదు. త్రిష ను ఎంపిక చేసినట్లు అంటున్నారే గానీ ఇందులో వాస్తవం తెలీడంలేదు. ఇక నటసింహ బాలకృష్ణ పరిస్థితి అయితే టూమచ్. గత కొన్నేళ్లుగా బాలయ్య 106 కు హీరోయిన్ ని వెతుకుతున్నారు. నయనతార, త్రిష, సోనాల్ చౌహన్ లలో ఒకరిని అడ్జెస్ట్ చేయాలి.దర్శకుడు బోయపాటి అదే పని మీద ఉన్నా ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు.

క్యాథరీన్ థ్రెసాను ఎంపిక చేశారని ప్రచారమైనా, అమ్మడు పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారట. కాజల్ అగర్వాల్.. తమన్నా లాంటి భామల్ని అడగాలంటే పారితోషికం 2 కోట్లు ముట్టజెప్పాలి. ఇక కియారా అద్వాణీ.. పూజా హెగ్డే లాంటి బిజీ యువ నాయికలు బాలయ్య సరసన అంత ఈజీగా ఒప్పుకోరు. దీంతో బోయపాటికి పెద్ద తల నొప్పిగా మారిందని ఇన్ సైడ్ టాక్. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు బాలయ్య కు ఇద్దరు నాయికల్ని ఎంపిక చేయాలి. ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి. అంతేకాదు, నాగార్జున, వెంకటేష్ లకు కూడా హీరోయిన్స్ సమస్య ఉంది. ఎంచుకున్న కథను బ్టటి వయసుకు తగ్గ కటౌట్లను వెతకాల్సి వస్తోంది.