Health

బిగ్ న్యూస్: కరోనా ప్రభావం మరియు లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తుంది. అయితే మనిషికి ఈ వైరస్ సోకితే ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఈ వైరస్ మనిషి శరీరంలో ఎన్ని రోజులు ఉంటుంది, ఏ రోజుల్లో ఎలాంటి ప్రభావం మరియు లక్షణాలు కనిపిస్తాయి అనే దానిపై ప్రముఖ జర్నల్‌ లాన్సెట్‌ ఒక నివేదికను వెల్లడించింది. అయితే చైనాలోని వూహాన్‌ పల్మనరీ ఆస్పత్రిలో 191 మంది కరోనా బాధితులను మూడు వారాల పాటు పరిశీలించి ఒక నివేదికను రూపొందించింది.

అయితే మనిషికి ఈ వైరస్ సోకిన వెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవు. దాదాపు ఐదు నుంచి 14 రోజుల తరువాత జ్వరం, గొంతు నొప్పి, జలుబు వంటి వాటితో మొదలవుతుంది. అయితే ఈ వైరస్ మన శరీరంపై ప్రభావం చూపించడం మొదలయ్యాక రోజు రోజుకు మనలో జరిగే మార్పులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

1) కరోనా వైరస్‌ శరీరంపై ప్రభావం చూపించిన మొదటి మూడు రోజులలో మొదట జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తాయి.

2) అయితే 4-9 రోజుల మధ్యలో ఈ వైరస్‌ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. ఆ తరువాత శ్వాస తీసుకోవడంలో సమస్యలు, జ్వరం తీవ్రత పెరగడం, తొమ్మిది రోజులు గడిచేసరికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది.

3) ఇక 8-15 రోజుల మధ్య కాలంలో ఊపిరితిత్తులకు చేరిన ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇది చాలా ప్రమాదకరం. ప్రాణాంతకమైన సెప్సిస్‌ (బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌) ఒక వారం తర్వాత మొదలవుతుంది. అప్పటి నుంచి రెండు వారాల పాటు బాధితులను ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి వారికి చికిత్స అందిస్తూ జాగ్రత్తగా కాపాడుకోవాలి.

4) ఇక ఈ వైరస్ సోకిన మూడు వారాల తరువాత రోగనిరోధక శక్తి అధికంగా ఉండి మరే ఇతర జబ్బులు లేని వారు మూడు వారాల పాటు సరైన చికిత్స ఇస్తే కరోనా బారి నుంచి తప్పించవచ్చు. డయాబెటిస్, హైపర్‌ టెన్షన్‌ వంటి వ్యాధులు ఉండి, వయసు ఎక్కువగా ఉన్న వృద్ధులు అయితే దీని బారి నుంచి భయటపడటం కాస్త కష్టమే అని నివేదికలో వెల్లడించింది.