Health

చెమటకు చెక్ పెట్టే ఆహార పదార్ధాలు..

సంవత్సరంలో మిగిలిన రోజులతో పోల్చితే వేసవిలో చెమటపట్టడం కాస్త ఎక్కువే. ఉష్ణోగ్రత, గాలిలో తేమను బట్టి చెమట తీవ్రత ఆధారపడి వుంటుంది. ఈ పరిస్థితులకు తగ్గట్టుగా మన చర్మం మీది స్వేద గ్రంధులు పనిచేస్తూ శరీరాన్ని వీలున్నంత మేరకు చల్లగా ఉండేలా చేస్తాయి. స్వేదగ్రందులు శరీరమంతా ఉన్నప్పటికీ తల, చంకలు, ముఖ చర్మంలో ఎక్కువగా ఉన్నందునే ఆయా భాగాలలో చెమట ఎక్కువగా పడుతుంటుంది. ఈ చెమటతో బాటు శరీరంలోని ప్రొటీన్లు, కొవ్వు, ఆమ్ల లవణాలు, అమ్మోనియా వంటివి కూడా బయటికి పోతుంటాయి. కొందరిలో శరీర దుర్వాసనకు కారణమవుతుంది.

ఆహారంలో తగిన మార్పులు చేసుకోవటం ద్వారా ఈ సమస్యను సమర్ధవంతంగా అధిగమించవచ్చు. మరీ ముఖ్యంగా కాఫీ, శీతల పానీయాలు, బ్లాక్ టీ, చాక్లెట్, వెల్లుల్లి, నీరుల్లి, చేపలు, రొయ్యల వంటి సీఫుడ్ మూలంగా చెమట అధికంగా పట్టే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలి. వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ తినటం వల్ల తగినంత నీరు, పీచు, పోషకాలు అందుతాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగు పరచి చెమటను అదుపులో పెడతాయి. పుచ్చలోని విటమిన్‌ బి జీవక్రియల పనితీరును ఎంతగానో మెరుగు పరుస్తుంది. తగినన్ని మంచినీళ్ళు తాగటం వల్ల శరీరంలోని నీటి నిల్వలు సమస్థితిలో ఉండి శరీరం చల్లగా ఉండి చెమట పట్టటం కూడా తగ్గుతుంది.

జీవక్రియల పనితీరు బాగుండాలంటే ఆహారంలో తగినంత బి కాంప్లెక్స్ విటమిన్ అందేలా చూసుకోవాలి. రోజువారీ ఆహారంలో బ్రెడ్ , గుడ్లు, చేపలు, గింజ ధాన్యం, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. క్యాల్షియం శరీర ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉండేలా చేసి, చెమటను తగ్గిస్తుంది. క్యాల్షియం పెరుగులో పుష్కలంగా లభిస్తుంది. పెరుగు ఇష్టపడని వారు ఇతర పాల పదార్ధాలు, బాదం గింజలు, చిక్కుళ్ళు వంటివి తీసుకోవచ్చు. ఆహారంలో తగినంత పీచు ఉంటే జీర్ణప్రక్రియ సులువుగా జరిగి చెమట పట్టటం తగ్గుతుంది. అందుకే రోజూ పీచు అధికంగా ఉండే గోధుమలు, ఓట్స్, పండ్లు తీసుకోవాలి. చెమట నివారణకు పుదీనా ఎంతగానో దోహదపడుతుంది.

పచ్చికూరగాయలు రోజూ తింటే శరీర దుర్వాసన సమస్య ఉండదు. తులసి, కొత్తిమీర తరుగును ఆహారంలో చేర్చినా శరీర దుర్వాసన తగ్గుతుంది. వేసవిలో రోజూ టమోటో రసం తాగటం వల్ల పలు విటమిన్లు, ఖనిజ లవణాలు అంది చెమట, దుర్వాసన వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి. టీ, కాఫీకు బదులుగా హెర్బల్ టీ తాగితే శరీర దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియా తొలగిపోతుంది. రోజూ కరివేపాకు తినేవారిలో చెమట, దుర్వాసన బెడద అసలేమాత్రం వుండవు. బాదంపప్పు చెమట సమస్యను అదుపులోకి తెస్తుంది. దీనిని కొనలేని వారు దానికి ప్రత్యామ్నాయంగా గుమ్మడి గింజలు, ఆకుకూరలు, సోయా వంటి వాటిని తీసుకున్నా చాలు.