స్టార్ హీరోలపై శ్రియా షాకింగ్ కామెంట్స్
‘నా ఇష్టం’ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో 2001లో ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరణ్ సౌత్ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్ధాలుగా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇంకా మొత్తం 5 సినిమాలకు కమిట్ అయింది. తెలుగులో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో పాటు మొదటిసారి సృజన అనే లేడీ డైరెక్టర్ తో ఒక సినిమా చేయబోతోంది. అలాగే రెండు తమిళ సినిమాలు.. ‘తడ్కా’ అనే హిందీ సినిమా కూడా శ్రియా శరణ్ చేస్తోంది. మొత్తం మీద ప్రస్తుతం ఇండస్ట్రీకి వస్తున్న హీరోయిన్స్ ఒకటీ రెండు సినిమాలకు పరిమితమవుతుంటే వచ్చి 20 ఏళ్ళవుతున్నా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ యంగ్ స్టర్స్ కి కూడా కాంపిటేషన్ గా మారుతోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కల్సి ‘సంతోషం’ సినిమా లో నటించి, క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన శ్రీయాకి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కొన్నేళ్ల పాటు తన వాలుచూపుతో యువ హృదయాలు కొల్లగొట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన శ్రీయ ఇప్పటికీ నటిస్తూనే ఉంది.
టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలైన నాగార్జున – చిరంజీవి – బాలయ్య – వెంకటేష్ – మోహన్ బాబు సరసన నటించింది. అలాగే మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – రవితేజ – ప్రభాస్ – ఎన్టీఆర్ లతో చేయడమేకాదు, శర్వానంద్ అల్లరి నరేష్ – తరుణ్ లాంటి హీరోల సరసన కూడా మెరిసింది. 2018లో ఆండ్రు కొశ్చివ్ అనే రష్యా వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీయ ప్రస్తుతం భర్తతో కలిసి స్పెయిన్ లోని బార్సిలోనాలో ఉండిపోయింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ డైలీ తన అప్ డేట్స్ పంచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. ముఖ్యంగా తాను నటించిన కొంతమంది హీరోల గురించి అడుగగా వారి గురించి చెప్పుకుంటూ వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కళ్లు బాగుంటాయని, అలా చూస్తూ ఉండిపోవచ్చని చెప్పుకొచ్చింది. ప్రభాస్ – శ్రియా కలిసి ‘ఛత్రపతి’లో నటించారు. ‘మున్నా’ సినిమాలో ఒక సాంగ్ లో ప్రభాస్ తో కలిసి స్టెప్పులేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళంలో తనకు ఫేవరేట్ హీరో అని శ్రేయ చెబుతూ ఆయన ఒక పవర్ హౌజ్ అని చెప్పింది.
రజినీతో కలిసి ‘శివాజీ’ సినిమాలో నటించేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పింది.ఇక ఎన్టీఆర్ గురించి శ్రీయ చెబుతూ, ఒకప్పుడు చూస్తే చాలా సైలెంట్ గా కనిపించేవాడని.. కానీ ఇప్పుడు చాలా మారిపోయాడు.. ప్రస్తుతం అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పింది. వీరిద్దరూ ‘నా అల్లుడు’ సినిమాలో కలిసి నటించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ అతను చాలా మంచి యాక్టర్ అని.. పవన్ బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉండేవాడని చెప్పుకొచ్చింది. తమిళ్ హీరో ధనుష్ అద్భుతమైన టాలెంటెడ్ యాక్టర్ అని, ఆయనతో నటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది. ధనుష్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడని.. తనకు కొడుకు పుట్టినప్పుడు నేను తండ్రి అయ్యానని సంతోషంగా అందరికీ చెప్పాడని వెల్లడించింది. ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న యువ హీరోయిన్స్ కి ఇచ్చే టిప్స్ ఏమీ లేవని శ్రేయ చెబుతూ … ‘మీ బెస్ట్ ఇవ్వండి.. బాగా కష్టపడండి.. వర్క్ ఎంజాయ్ చేయడం నేర్చుకోండి.. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందుకు సాగిపోండి’అంటూ సూచనలు ఇచ్చింది. కరోనా వచ్చి చాలా విషయాలను నేర్పిందని.. దీని వలన జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని.. లాక్ డౌన్ స్టోరీస్ ఇన్స్పైర్ చేశాయని శ్రేయ వివరించింది.

