ఈ హీరోల కోసం రూల్స్ మార్చేసారా… ?
కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ కారణంగా గత రెండున్నర నెలలుగా సినీ ఇండస్ట్రీ మూసేసారు. ఇక థియేటర్లూ మూతపడ్డాయి. సినిమాలు ,సీరియల్స్ షూటింగ్స్ నిల్ కావడంతో నటీనటులంతా ఇంటికి పరిమితం అయ్యారు. అయితే సడలింపులు నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు సినిమా షూటింగులకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిస్తూ వస్తున్నాయి. అయితే కొన్ని షరతులు, నిబంధనలతో మాత్రమే అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జూన్ 15 నుండి సీరియల్స్, సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని ఆర్డర్స్ వచ్చాయి. తెలంగాణా ప్రభుత్వం సేఫ్టీ మెజర్స్ దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధలు అనుగుణంగా మాత్రమే షూటింగ్స్ చేసుకోవాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
అయితే ఈ నిబంధనలలో 10 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ళ పై బడిన వాళ్ళను షూటింగ్ లో పాల్గొనడానికి మెడికల్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. ఎందుకంటే, కొన్ని రాష్ట్రాల్లో 60కి పైగా వయసు ఉన్నవాళ్లు షూటింగ్స్ కు అనుమతింపబడరు అని నిబంధనలలో పేర్కొన్నాయి. అలానే కొన్ని రాష్ట్రాలు 8 సంవత్సరాల లోపు వారు.. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారు ఇంటి నుంచి బయటికి రావద్దనే నిబంధనలను విధించారు. అయితే టాలీవుడ్ కి సంబంధించి అలాంటి నిబంధనలు లేకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
కేవలం టాలీవుడ్ లో ముఖ్యంగా నలుగురు స్టార్ హీరోల కోసమే నిబంధనలలో 60 ఏళ్ళ పైబడిన వారు మెడికల్ అధికారుల అనుమతితో షూటింగ్ లో పాల్గొనవచ్చని పేర్కొన్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోలందరూ 60కి దగ్గరగా 60 క్రాస్ అయ్యి ఉన్నారు. ఇక స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఈ జాబితాలోకే వస్తారు.
వెంకటేష్ కూడా ఈ ఏడాదే 60వ పడిలోకి చేరతాడు. అందుకే టాలీవుడ్ కి ఈ నిబంధనలు వర్తించవా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ అలాంటి రూల్స్ చేర్చి ఉంటే ఇప్పట్లో షూటింగ్స్ జరగడం కష్టమే. వయసు 60 చుట్టూ తిరుగుతున్నా సరే, యంగ్ హీరోలకు తీసిపోకుండా, డ్యాన్స్‌లు ఫైట్స్, రోమాన్స్ ఇలా అన్నింటికీ సై అనేస్తున్నారు. అందుకే షష్టిపూర్తి హీరోలు షూటింగ్స్ లో పాల్గొనకూడదని నిబంధనలు అవసరం లేదని, టాలీ వుడ్ స్టార్ హీరోలకు ఏజ్ కేవలం జస్ట్ నెంబర్ మాత్రమే అనే కామెంట్స్ వస్తున్నాయి.

