ఈ అక్కినేని వారసుడికి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో…
అసలు టాలీవుడ్ అనగానే ఎన్టీఆర్ ,ఏ ఎన్ ఆర్ పేర్లే వినిపిస్తాయి. వీరిద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్లుగా వెలిగారు. ఇప్పుడూ ఇద్దరూ లేరు గానీ, వారి మూడో తరం కూడా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అయితే అక్కినేని వంశానికి సంబంధించి తనయుడు నాగార్జున తండ్రికి తగ్గట్టు తన టాలెంట్ తో ఎదిగాడు. ఇక నాగ్ కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చారు. నాగచైతన్య కొంచెం పర్వాలేదు గానీ, అదిరిపోయే బ్యాగ్రౌండ్‌తో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇంతవరకు మూడు సినిమాలు చేసినా సరే, ఒక్క హిట్ పడలేదు. మొదటి సినిమా అఖిల్‌తోనే పెద్ద డిజాస్టర్‌ను మూటగట్టుకుని, అప్పటినుండి హిట్ కోసం తపిస్తున్నాడు.
ఇప్పటికే ఒక సినిమా చేస్తున్న అఖిల్ తాజాగా తమిళ దర్శకుడు మిత్రన్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. విశాల్ హీరోగా అభిమన్యుడుతో సత్తా చాటిన డైరక్టర్ మిత్రన్ అఖిల్ తో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందట. కొత్తదనం ఉండడంతో అఖిల్ కొంత ఆలోచనలో పడ్డాడట. మామూలుగా కొత్త కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇంతవరకూ మాస్ కథల్నీ వదిలీ ప్రేమ కథలను ఎంచుకున్న కూడా అఖిల్ కి అదృష్టం కలిసిరావట్లేదు.
అందుకే ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ మూవీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని అఖిల్ పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు అఖిల్ తండ్రి నాగార్జున కూడా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. కొడుక్కి మాంచి హిట్ అందించాలనీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా చూసిన నాగార్జున సినిమా అవుట్ పుట్ పట్ల సంతోషంగా ఉన్నాడట. ఇక ఈ సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సమ్మర్ రిలీజ్ అవ్వాలి. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ మూవీ తెరకెక్కనుంది. మనోడి స్టార్ మారుతుందో లేదో ఈ సినిమాలు తేల్చేస్తాయి.
