Devotional

రేపటి నుంచి శ్రావణమాసం….ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో చూడండి

శ్రావణమాసం లక్ష్మి దేవికి,శివునికి ఇష్టమైన మాసం. ఈ సంవత్సరం శ్రావణమాసం జులై నెలలో రేపటి నుండి అంటే 21 వ తేదీ మంగళవారం నుండి అవుతుంది. ఈ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అన్ని ఎంతో ప్రత్యేకతమైనవి.అందుకే హిందువులు అందరు ఈ మాసంను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రావణమాసంలో సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయడం, పార్వతీదేవికి కుంకుమ పూజలు చేసి ఉపవాసం ఉంటారు. మంగళవారం రోజున పెళ్లి చేసుకున్న మహిళలు మంగళవార నోములు నోచుకుంటారు. తమ మాంగళ్యాన్ని కాపాడమని పూజలు చేస్తూ, ముత్తైదువులకు శనగలు వాయనంగా ఇస్తారు.

శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. అది ఎక్కువగా రెండో శుక్రవారమే వస్తుంది. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ధనంతో పాటు ప్రేమ, కీర్తి, ప్రతిష్టలతు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేయటం కుదరని వారు ఈ మాసంలో ఏ శుక్రవారం అయినా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో చాలా మంది వెంకటేశ్వరస్వామికి హారతి ఇవ్వడం, చలిమిడిని నైవేద్యంగా పెట్టడం వంటివి చేస్తారు. అలాగే శనిదేవుని అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు ఎంతగానో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడే అన్నా చెల్లెళ్ళ అనుబంధంగా రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటారు.