Devotional

Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాల ముహూర్తం ఖరారు.. ఎప్పుడో తెలుసా..

Godavari Pushkaralu 2027..గోదావరి పుష్కరాలు 2027: ముహూర్తం ఖరారు.. ఎప్పుడో తెలుసా..సరస్వతి నదీ పుష్కరాల సందడి ముగిసింది. త్వరలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, గోదావరి నది ప్రవహించే ప్రతి ప్రాంతంలోనూ ఈ పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తారు.

అయితే, గోదావరి పుష్కరాలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రాజమహేంద్రవరం. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లపై దృష్టి సారించింది. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ, పుష్కరాల నిర్వహణ కోసం ప్రణాళికలు రూపొందిస్తోంది.

హిందువులు నదులను దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. ముఖ్యంగా, పుష్కరాల సమయంలో నదుల్లో స్నానం చేసి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారతదేశంలోని 12 ప్రధాన పవిత్ర నదులకు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే, ఆ రాశి ఆధారంగా సంబంధిత నదులకు పుష్కర వేడుకలు నిర్వహిస్తారు.

దేవగురువు బృహస్పతి సింహ రాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈ సందర్భంగా, 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాల కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లు
2027లో జరగనున్న గోదావరి పుష్కరాల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దాదాపు 8 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ లక్ష్యంతో, పుష్కర ఘాట్లను సిద్ధం చేసేందుకు భారీ బడ్జెట్‌తో ప్రతిపాదనలు రూపొందిస్తోంది. 2015లో రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, రానున్న పుష్కరాలకు మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఒకే ఘాట్ వద్ద స్నానం చేయాల్సిన అవసరం లేకుండా, గోదావరి నది ఒడ్డున ఎక్కడైనా స్నానం చేయవచ్చని ప్రచారం చేయనున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధి కోసం అధికారులు రూ.904 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా రూ.100 కోట్ల నిధులను కేటాయించింది. రైల్వే శాఖ కూడా భక్తుల సౌలభ్యం కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.271.43 కోట్లు మంజూరు చేసింది. దేశంలోని ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు, వాటి వివరాలను ముందస్తుగా ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

అఖండ గోదావరి పుష్కరాలు-2027 కోసం ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. యాత్రికుల సౌలభ్యం కోసం బస్సు ఏర్పాట్లతో పాటు, రాజమండ్రిలో గోదావరి తీరంవద్ద మరో నాలుగు కొత్త ఘాట్లను నిర్మించాలని ప్రతిపాదించారు.

రాజమహేంద్రవరం పరిధిలో ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లు, కార్పొరేషన్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తంగా, గోదావరి పుష్కర ఘాట్ల కోసం అవసరమైన నిధులపై అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. నిధుల సమీకరణతో పాటు, గోదావరి తీర ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.