IRCTC Tour:వైష్ణోదేవి ఆలయం నుంచి రుషికేశ్ వరకు యాత్ర…టికెట్ ధరలు.. పూర్తి వివరాలు..
ఇండియన్ రైల్వే ఒకవైపు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతూనే, మరోవైపు విహార యాత్రలు మరియు పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక ప్యాకేజీలను అతి తక్కువ ధరలో అందిస్తోంది. ఈ క్రమంలో భారత గౌరవ టూరిస్ట్ ట్రైన్స్ ద్వారా వివిధ ప్యాకేజీలను నిర్వహిస్తోంది.
అందులో ఒకటి ‘మాతా వైష్ణో దేవీ విత్ హరిద్వార్ రిషికేశ్ టూర్’. ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. వేసవి సెలవులు ముగిసే సమయంలో ఉత్తర భారత యాత్రను ప్లాన్ చేయాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రైల్వే సూచిస్తోంది. ఈ యాత్రలో ఏయే పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు మరియు టికెట్ ధరల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సందర్శించే ప్రాంతాలు
ఈ ఉత్తర భారత యాత్రలో యాత్రికులు వైష్ణో దేవీ ఆలయం, హరిద్వార్, రిషికేశ్, ఆగ్రా, మధురలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తారు. ఈ యాత్ర మొత్తం 9 రాత్రులు మరియు 10 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ విజయవాడ నుంచి ప్రారంభమై, గుంటూరు, సికింద్రాబాద్, కాజీపేట, నాగ్‌పూర్, ఆగ్రా, మధుర, కట్రా, హరిద్వార్, రిషికేశ్‌లను కవర్ చేస్తూ, తిరిగి విజయవాడకు చేరుకోవడంతో ముగుస్తుంది.
టికెట్ ధరలు
– స్లీపర్ క్లాస్: పెద్దలకు రూ.17,940, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.16,820.
– థర్డ్ ఏసీ: పెద్దలకు రూ.29,380, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.28,070.
– సెకండ్ ఏసీ: పెద్దలకు రూ.38,770, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.37,200.
టూర్‌లోని సౌకర్యాలు
ఈ యాత్రలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించబడతాయి. టీ/కాఫీ కూడా ప్యాకేజీలో భాగమే. ట్రైన్ నుంచి దిగిన తర్వాత ఆయా ప్రాంతాల సందర్శన కోసం బస్సు సౌకర్యం, హోటల్ ఖర్చులు, గైడ్ సేవలు కూడా ఈ ప్యాకేజీలో చేర్చబడతాయి. అంతేకాకుండా, ప్రయాణికుల కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఇవి కాకుండా ఇతర వ్యక్తిగత ఖర్చులు ఉంటే వాటిని యాత్రికులే భరించాలి.
మరిన్ని వివరాల కోసం https://www.irctctourism.com/ ను సందర్శించవచ్చు.

