Shravana Masam 2025:ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం.. ముఖ్యమైన పండగలు ఎప్పుడు వస్తాయంటే..
Shravana Masam 2025:ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం.. ముఖ్యమైన పండగలు ఎప్పుడు వస్తాయంటే..తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో 12 నెలల్లో ప్రతి నెలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఏడాది మొదటి రోజు ఉగాది పండగతో ఆరంభమవుతుంది. ప్రతి నెలలో వివిధ పండగలు, పర్వదినాలు, శుభ ముహూర్తాలు ఉంటాయి.
తెలుగు నెలల్లో ఐదవ నెల శ్రావణ మాసం. వర్షాకాలంలో వచ్చే ఈ నెలలో ప్రతి రోజు ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ నెలలో వచ్చే పండగలతో పాటు శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు కూడా ప్రత్యేకమైనవి. ఈ సందర్భంలో శ్రావణ మాసంలో వచ్చే కొన్ని ప్రముఖ పండగల గురించి తెలుసుకుందాం.
శ్రావణ మాసం సంవత్సరంలో ప్రత్యేకమైన నెల. ఈ నెల ఆధ్యాత్మిక సందడి, భక్తితో నిండిన వాతావరణంతో అత్యంత విశిష్టంగా ఉంటుంది. ఈ ఏడాది శ్రావణ మాసం జూలై 25 నుంచి ప్రారంభమై, ఆగస్టు 23తో ముగుస్తుంది. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు పలు ముఖ్యమైన పండగలను జరుపుకోనున్నాము. ఈ రోజు శ్రావణ మాసంలోని ప్రధాన పండగల గురించి తెలుసుకుందాం.
నాగ పంచమి: శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది నాగ పంచమి జూలై 29, మంగళవారం నాడు వస్తుంది. ఈ రోజు పుట్టలో పాలు పోసి నాగ దేవతలను పూజిస్తారు.
వరలక్ష్మీ వ్రతం: శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం ప్రత్యేకమైనది. మహిళలు సుమంగళిగా జీవించే వరం, కుటుంబ సభ్యుల ఆయురారోగ్యం, సిరిసంపదల కోసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం మరింత ఫలవంతమని నమ్ముతారు. ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8, శుక్రవారం నాడు జరుగుతుంది. ఆగస్టు 1, 15, 22 తేదీలలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
వారాహి జయంతి: ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతంతో పాటు వారాహి జయంతిని కూడా జరుపుకుంటారు.
రాఖీ పండగ: సోదర సోదరీమణుల ప్రేమకు గుర్తుగా జరుపుకునే రాఖీ పండగ ఈ ఏడాది ఆగస్టు 9, శనివారం నాడు వస్తుంది. చెల్లెళ్లు అన్నలకు, అక్కలు తమ్ముళ్లకు రాఖీ కట్టి ఈ పండగను జరుపుకుంటారు. ఈ రోజున జంధ్యాల పౌర్ణమి కూడా జరుగుతుంది, ఈ సందర్భంలో జంధ్యం మార్చుకునే సంప్రదాయం ఉంది.
కృష్ణాష్టమి: శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు జన్మించిన తిథిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 16న శ్రీ కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు.
బలరామ జయంతి: శ్రీ కృష్ణుడి అంశ అయిన బలరాముడి జన్మదినోత్సవాన్ని ఆగస్టు 14న జరుపుకుంటారు.
పోలాల అమావాస్య: శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య తిథిని పోలాల అమావాస్యగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఇది ఆగస్టు 23, శనివారం నాడు వస్తుంది.
శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు, పండగల వివరాలు:
జూలై 25: మొదటి శ్రావణ శుక్రవారం
జూలై 29: మొదటి శ్రావణ మంగళవారం, నాగ పంచమి
ఆగస్టు 1: రెండవ శ్రావణ శుక్రవారం
ఆగస్టు 5: రెండవ శ్రావణ మంగళవారం
ఆగస్టు 8: మూడవ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం, వారాహి జయంతి
ఆగస్టు 9: రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి
ఆగస్టు 12: మూడవ శ్రావణ మంగళవారం
ఆగస్టు 14: బలరామ జయంతి
ఆగస్టు 15: నాలుగవ శ్రావణ శుక్రవారం
ఆగస్టు 16: కృష్ణాష్టమి
ఆగస్టు 19: నాలుగవ శ్రావణ మంగళవారం
ఆగస్టు 22: ఆఖరి శ్రావణ శుక్రవారం
ఆగస్టు 23: పోలాల అమావాస్య

