Gold Rate:బంగారం ధర భారీగా పెరుగుతుందా లేదా తగ్గుతుందా.. బంగారం భవిష్యత్తు ఏంటి..?
Gold Rate:రాబోయే 20 సంవత్సరాలలో బంగారం ధరలు ఎలా ఉంటాయి? బంగారం ధర భారీగా పెరుగుతుందా లేక తగ్గుతుందా? ఈ అంశాన్ని విశ్లేషిద్దాం.
బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి అమెరికా డాలర్ విలువ తగ్గడం. డాలర్ విలువ పడిపోయే కొద్దీ, అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ కూడా తగ్గుతుంది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ట్రెజరీ బాండ్లకు బదులు బంగారంలో పెట్టుబడి చేయడానికి ఆసక్తి చూపిస్తారు, ఫలితంగా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతాయి.
గత 25 సంవత్సరాల డేటాను పరిశీలిస్తే, 2000 నుంచి 2025 వరకు బంగారం ధర సుమారు 25 రెట్లు పెరిగింది. ముఖ్యంగా గత ఐదేళ్లలో ఈ ధర దాదాపు మూడు రెట్లు పెరిగింది. అమెరికా స్టాక్ మార్కెట్‌లో డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పతనం కూడా బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణం. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3500 డాలర్లను దాటింది.

భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అని ఖచ్చితంగా చెప్పడం కష్టం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గత 25 సంవత్సరాల ధోరణిని బట్టి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. చైనాతో సహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ సంపదను బంగారం రూపంలో భద్రపరచడానికి ఆసక్తి చూపుతున్నాయి, ఇది బంగారం ధరల పెరుగుదలకు మరో కారణం. అదే సమయంలో, గోల్డ్ ETF స్కీములలో పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి, ఇది బంగారం పట్ల పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తుంది.
అయితే, రాబోయే 20 సంవత్సరాలలో బంగారం ధరలు స్థిరంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, క్రిప్టో కరెన్సీలు వంటి కొత్త పెట్టుబడి సాధనాలు బంగారానికి సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రిప్టో కరెన్సీలు ఇప్పటికే జనాదరణ పొందుతున్న నేపథ్యంలో, బంగారం ధరలపై వీటి ప్రభావం కూడా గమనించాల్సి ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి సలహాగా భావించరాదు. బంగారం, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్ లేదా ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని సూచిస్తున్నాము. ఈ సమాచారానికి సంబంధించి ఎలాంటి లాభనష్టాలకు టైమ్స్ నౌ తెలుగు బాధ్యత వహించదు.Fast

