Credit Card:మీకు క్రెడిట్ కార్డు ఉందా.. ఈ విషయాలు తెలిస్తే వెంటనే తీసుకుంటారు..
Credit Card:మీకు క్రెడిట్ కార్డు ఉందా.. ఈ విషయాలు తెలిస్తే వెంటనే తీసుకుంటారు.. మన దేశంలో ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. బ్యాంకులు సులభంగా క్రెడిట్ కార్డులను జారీ చేయడంతో ఎక్కువ మంది వీటిని స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం డెబిట్ కార్డుల కంటే క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయి. ఒక దశలో అన్‌సెక్యూర్డ్ రుణాలపై ఆర్‌బీఐ కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ, క్రెడిట్ కార్డుల వాడకం గణనీయంగా పెరిగింది. అయితే, చాలా మంది ఇప్పటికీ క్రెడిట్ కార్డులు తీసుకోవాలా, వద్దా, తీసుకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతామా అనే సందిగ్ధంలో దూరంగా ఉంటున్నారు. ఆర్థిక క్రమశిక్షణతో క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తూ సకాలంలో చెల్లింపులు చేస్తే క్రెడిట్ హిస్టరీ నమోదవుతుంది. బాధ్యతాయుతంగా వాడకం, సకాలంలో చెల్లింపుల ద్వారా మంచి క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణతో మెరుగైన క్రెడిట్ స్కోర్ నిర్వహించవచ్చు. అలాంటి వారికి భవిష్యత్తులో బ్యాంకులు త్వరగా రుణాలు మంజూరు చేస్తాయి. వడ్డీ రేట్లపై రాయితీలు కూడా కల్పిస్తాయి, తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తాయి.
డిజిటల్ లావాదేవీలు, అత్యవసర చెల్లింపులకు క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. డెబిట్ కార్డులతో కూడా ఇలాంటి లావాదేవీలు చేయవచ్చు, కానీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండాలి. లేకపోతే చెల్లింపులు చేయలేము. కానీ క్రెడిట్ కార్డుతో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. పిల్లల ఫీజులు, బీమా ప్రీమియంలు, వైద్య ఖర్చుల వంటి అత్యవసర ఖర్చులను క్రెడిట్ కార్డుతో గడువు తేదీలోపు చెల్లించవచ్చు. ఆ తర్వాత నెల రోజుల వరకు వడ్డీ లేకుండా తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది.

అకస్మాత్తుగా నగదు అవసరమైతే ఏం చేయాలో తెలియక, తెలిసిన వారిని అడగాల్సి వస్తుంది. కానీ క్రెడిట్ కార్డుతో ఈ అవసరం లేకుండానే నగదు పొందవచ్చు. వైద్య అత్యవసర పరిస్థితుల్లో నగదు తక్షణం అవసరమవుతుంది. అలాంటి సమయంలో కార్డు క్రెడిట్ లిమిట్ ఆధారంగా బ్యాంక్ ఏటీఎంల నుండి నగదు ఉపసంహరణ చేయవచ్చు. అయితే, ఇలాంటి ఉపసంహరణలపై సంవత్సరానికి 36 శాతం వరకు వడ్డీ విధించబడవచ్చు.
ఏదైనా అవసరానికి నగదు కావాల్సి వచ్చినప్పుడు, క్రెడిట్ కార్డు ద్వారా తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి క్రెడిట్ కార్డు కంపెనీలు ప్రీ-అప్రూవ్డ్ రుణాలను మంజూరు చేస్తాయి. ఇలాంటి రుణాలు త్వరగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులను కూడా మాఫీ చేస్తాయి, దీనివల్ల అదనపు ప్రయోజనం పొందవచ్చు.
క్రెడిట్ కార్డులు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ఉచిత లాంజ్ యాక్సెస్‌ను అందిస్తాయి. అలాగే, చెక్-ఇన్ సౌకర్యాలను కల్పిస్తాయి. కొన్ని క్రెడిట్ కార్డులతో విమానాశ్రయ లాంజ్‌లలోకి ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ప్రవేశించవచ్చు. దీనివల్ల ఎక్కువ ఖర్చు లేకుండా సౌకర్యవంతమైన విమానాశ్రయ లాంజ్ సేవలను ఆస్వాదించవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

