Politics

విలీనం దిశగా జనసేన ? ఇందులో వాస్తవం ఎంత?

ఏ పార్టీ అయినా నడపాలంటే ముందు అధికారం కావాలి. అది ఉంటేనే జవసత్వాలు ఉంటాయి. పైగా కొత్తగా పుట్టే పార్టీలైతే మరీను. లేకపోతే ఎవరూ ఆ పార్టీలో మిగలరు. సినీనటుడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సందర్బంగా జనసేన పార్టీ పెట్టినా పోటీ చేయకుండా బిజెపి,టీడీపీ లకు మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు బరిలో దిగాడు. అయితే తన అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలానే వేరొక పార్టీలో విలీనం చేసేస్తారా.?? ఎన్నికల తరువాత ఈ ప్రక్రియ ఉంటుందా.?? అనే వార్తలు వస్తున్నాయి. ఎపీలోని జనసేన వర్గాలలో, కార్యకర్తలు, అభిమానుల చుట్టూ ఈ వార్తలు తిరుగుతూ వేధిస్తున్నాయి. ఇదే జరిగితే తాము భారీగా నష్టపోతామని కొందరు నేతలు తెగ కంగారు పడుతున్నారట. అసలు ఈ వార్తలు రావడానికి, ఇన్ని అనుమానాలు రెకేత్తడానికి ప్రధాన కారణం జనసేనానే అంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కధనం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి సభలో చేసిన ప్రసంగం ఈ సందేహాలకి తావిస్తోందని అంటున్నారు. అదేంటంటే ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు పార్టీని నడిపిస్తానని పవన్ చెప్పడంతో అందులో నిగూడంగా దాగిఉన్న అర్థాలని విమర్శకులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో పవన్ కు ప్రజల ఆశీస్సులు లభించవని స్పష్టంగా అర్థమవుతోంది. మరి పవన్ చేసిన వ్యాఖ్యల ప్రకారం పార్టీని ఏమి చేస్తారు అనే లాజిక్ ఇప్పుడు పవన్ కొంప ముంచేలా ఉంది.

పవన్ కూడా తన అన్న చిరంజీవి మాదిరిగానే ఏదైనా పార్టీలో జనసేనని విలీనం చేస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. అనకాపల్లి సభలో తన పార్టీ ప్రకటించిన పధకాలని పవన్ మరో సారి ప్రజలకి గుర్తు చేశారు. ఎలాగో అధికారంలోకి రామని ఫిక్స్ అయిన పవన్ ఎన్ని వాగ్దానాలు అయినా ఇచ్చేస్తారని ఇప్పటికే కామెంట్స్ వినిపిస్తున్న నేపధ్యంలో తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన సైనికులలో కూడా ఆందోళన లో పడేస్తున్నాయి.

విరామం లేకుండా భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నా సరే పవన్ కి తాజా పరిస్థితులు చూస్తే, జనం వస్తున్నా సరే తనకి ఊహించని స్థాయిలో సీట్లు రావని ఫిక్స్ అయ్యారని పరిశీలకులు అంటున్నారు. అందుకే ఇలా నిస్సహాయంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. సమైక్య ఆంద్రప్రదేశ్ లో చిరంజీవికి 18 సీట్లు వచ్చినా సరే పార్టీని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందారు.

మరి పవన్ కి సర్వేలు అన్నీ 5 లోపు మార్కులు వేస్తుంటే పవన్ ఏమి చేస్తాడోఊహించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. భవిష్యత్తులో జరిగే పరిణామాలే ఎలా ఉంటాయో ఎన్నికల తర్వాత క్లారిటీ రావచ్చని అంటున్నారు.