వర్మ ఆహ్వానాన్ని లక్ష్మీపార్వతి ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా?
సంచలనాలకు కేరాఫ్ అడ్రాస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కాంట్రవర్సీ అవ్వకుండా ఉండదని చెప్పాలి. ఇక వర్మ తీసుకున్న ఓ తాజాగా నిర్ణయం కూడా విజయవాడలో ఉద్రిక్త పరిస్థితుల్ని తీసుకొచ్చింది. ఆదివారం సాయంత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విజయవాడలో ప్రెస్ మీట్ పెడతానంటూ వర్మ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అయితే వర్మ విజయవాడ చేరుకోగానే, పోలీసులు అడ్డుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోమన్నారు. కానీ వర్మ తాజాగా తెరపైకి తీసుకొచ్చిన ఈ వివాదంతో పాటు మరో అంశం తెరపైకి రావడంతో అందరూ ఖంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడలో పెడుతున్న ప్రెస్ మీట్‌కు రావాలని లక్ష్మీ పార్వతిని కూడా ఆహ్వానించినట్లు, వర్మ ఆహ్వానాన్ని లక్ష్మీ పార్వతి సున్నితంగా తిరస్కరించారన్న టాక్ తెరపైకి వచ్చింది.
సహజంగానే ఇది హాట్ టాపిక్ అయింది. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రెస్ మీట్‌లో కనిపించి సందడి చేసిన లక్ష్మీ పార్వతి అకస్మాత్తుగా ఎందుకు వర్మకు మొహం చాటేశారోనని అందరూ చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆమెకు పెద్దగా నచ్చి ఉండదని అంటున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ విడుదలైన సందర్భంగా లక్ష్మీపార్వతి వర్మపై ప్రశంసలు కురిపిస్తూ “నా జీవితంలో జరిగింది. 23 ఏళ్లు అయినా… ప్రతిక్షణం, ప్రతిమాట, ప్రతి చర్యా గుర్తుంది నాకు.
అవి గుర్తున్నాయి కనుకనే నేనీ విధంగా నిలబడివుండగలిగాను. నిజంగా వర్మగారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు’ అని పేర్కొన్నారు. అయితే సినిమా తీసే సమయంలో నిజంగా తనను వర్మ సంప్రదించలేదన్నారు. కనీసం మీరేమైనా చెబుతారా? అని నన్ను అడగలేదన్నారు. మరి అప్పుడు అంతగా పొగిడిన లక్ష్మీ పార్వతి ఇప్పుడు వర్మ పిలిస్తే ప్రెస్ మీట్‌కు వెళ్లకపోవడం వెనుక గల ఆంతర్యమేమిటని జోరుగా చర్చ సాగుతోంది.

