Movies

మండుటెండల్లో టాలీవుడ్ హీరోల పరిస్థితి చూసారా ?

మూడు కాలాల్లో వేసవి కాలం అనగానే అందరూ చెమటలు కక్కాల్సిందే. ఇక మే నెలలో అయితే, భానుడి భగభలు తట్టుకోలేనంతగా ఉంటాయి. అందుకే మన హీరోలకు సినిమా షూటింగ్ లకి సెలవు పెట్టి, ఫ్యామిలీతో హాయిగా శీతల ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకో ఈసారి మాత్రం వేసవి ఎండలోనూ చెమటలు కక్కుతూ షూటింగ్ లకు హాజరవుతున్నారు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా 50వ వడిలో ఉన్నా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ గల కింగ్ నాగార్జునకు ఫ్యామిలీ ట్రిప్పులంటే మహా సరదా. అందుకే, వీలున్నప్పుడల్లా ఫ్యామిలీతో ట్రిప్పులు వేయడానికి ప్రాధాన్యమిస్తారు. ఈసారి రూటు మార్చి షూటింగ్ కే మొగ్గుచూపారు. దీంతో నాగార్జున ఈ మండుటెండల్లో కూడా ‘మన్మధుడు 2’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్ తో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తైపోతుందని రెస్ట్ లేకుండా షూటింగ్ బిజీలో ఉన్నాడు. 

ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ సినిమాతో బిజీ అయ్యాడు. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అయిన ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ లో ఈ చిత్రం రిలీజ్ అవ్వాలంటే, జూన్ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వాల్సి ఉంది. ఆ తరువాత నిర్మాణాంతర కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అందుకే చిరంజీవి కూడా వేసవి సెలవుల కు దూరంగానే ఉన్నాడు. ఇక ‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ఎంత పెరిగిపోయిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ‘సాహో’మూవీని ఆగష్టు 15న రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఫిల్మ్ యూనిట్ ఉంది. అందుకే ప్రభాస్ కి ఈ వేసవిలో సెలవు దొరకడం కష్టమ ని తెలిసిపోయి, సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పనులు ఎంతో వేగవంతంగా సాగుతున్నాయి. 

కాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మకమైన ‘ఆర్.ఆర్. ఆర్’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా 2020లో రిలీజ్ చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేశారు. కాకపొతే,హీరో రాంచరణ్ చేతికి గాయమవడం వలన ఈ చిత్రం షూటింగ్ కి బ్రేక్ పడింది. తిరిగి ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది. ఇంకేముంది ఈ హీరోలకు కూడా ఈ వేసవికి సెలవులు కష్టమయ్యాయి. ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు కష్ణం తీరికలేకుండా షూటింగ్ తో తలమునకలై ఉన్నారు. ఇలా, టాలీవుడ్ హీరోలు ఎండను లెక్కజేయకుండా సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్నారు. మన హీరోలు ఒక సినిమా చేస్తున్నప్పుడే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోన్న ఈ సమయంలో ప్రతి హీరో కూడా తమ తమ సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సిన అవసరం రావడంతో సెలవులకు కూడా దూరంగా ఉంటూ చెమటలు కక్కేస్తున్నారు.