Movies

ప్రభాస్ కు అస్సలు బోరు కొట్టని సినిమాలు ఏమిటో తెలుసా?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు, అభిరుచుల గురించి మీడియాతో మాట్లాడ‌టం అరుదు. సాహో ప్ర‌మోష‌న్ల కోసం చాన్నాళ్ల త‌ర్వాత మీడియాతో మాట్లాడుతున్న అత‌ను.. కాస్త మ‌న‌సులో మాట‌లు బ‌య‌ట‌పెడుతున్నాడు. త‌న అభిరుచుల గురించి వివ‌రిస్తున్నాడు. త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన సినిమాల గురించి ప్ర‌భాస్ తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.ఎక్కువ యాక్ష‌న్ సినిమాలే చేసే ప్ర‌భాస్‌కు వ్య‌క్తిగ‌తంగా మాత్రం కామెడీ చిత్రాలంటే ఎక్కువ ఇష్ట‌మ‌ని చెప్పాడు. అలా చూసిన వాటిలో రాజేంద్ర‌ప్ర‌సాద్ సినిమాలే చాలా ఉన్న‌ట్లు వెల్ల‌డించాడు. ఇక మోడ‌ర్న్ సినిమాల్లో త‌న‌కు పోకిరి అంటే చాలా ఇష్ట‌మ‌ని.. అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్ట‌ద‌ని..అలా వెళ్లిపోతూ ఉంటుంద‌ని చెప్పాడ‌త‌ను.

అలాగే ఇడియ‌ట్ సినిమా కూడా చాలాసార్లు చూశాన‌ని ప్ర‌భాస్ వెల్ల‌డించాడు.మొత్తానికి ప్ర‌భాస్‌కు అత్యంత ఇష్ట‌మైన రెండు సినిమాలు పూరి జ‌గ‌న్నాథ్‌వే కావ‌డం విశేషం.మ‌రోవైపు త‌న సినిమాల్ని తాను చూడ‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌న‌ని ప్ర‌భాస్ తెలిపాడు. ఏ సినిమా చూసినా.. అందులో లోపాలే క‌నిపిస్తాయ‌ని.. ఇక్క‌డ ఇలా ఉండాల్సింది కాదు.. ఇలా చేయాల్సింది కాదు అనిపిస్తుంద‌ని.. అందుకే త‌న సినిమాలు ఏవైనా టీవీలో వ‌స్తున్నా కూడా ఛానెల్ మార్చేస్తాన‌ని ప్ర‌భాస్ చెప్పాడు. బాహుబ‌లి సినిమాను ఒక్క‌సారి మాత్ర‌మే థియేట‌ర్లో చూసుకున్నాన‌ని.. మ‌ళ్లీ ఈ మ‌ధ్యే హోం థియేట‌ర్లో ఒక‌సారి చూశాన‌ని ప్ర‌భాస్ వెల్ల‌డించాడు.