వీరి మనవలు కూడా టాలీవుడ్ హీరోలే ఎవరో తెలుసా?
Tollywood legends :విలనిజం పండించడంలోనే కాదు, క్యారెక్టర్ యాక్టర్ గా కూడా తన నటనతో తెలుగు ప్రజల మదిలో చెరగని ముద్ర వేసిన అలనాటి విలక్షణ నటుడు నాగభూషణం నాటక రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. రక్తకన్నీరు నాటకం టికెట్టు పెట్టి మరీ ఆడిన నటుడు ఈయన. అంతటి గొప్ప నటుడి కూతురు మీర్ అనే బాలీవుడ్ దర్శకుడిని పెళ్లిచేసుకుంది. వాళ్ళబ్బాయి సయ్యద్ అమీద్ భూషణ్ తన మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే హీరోగా తగిన గుర్తింపు రాలేదు. అర్ధంచేసుకోరు, మ్యావ్, పదహారేళ్ళ వయసు, ఏక్ పోలీస్ మంత్రి అంటూ కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్లి, వాళ్ళ తాతయ్య నాగభూషణం మాదిరిగా విలన్ పాత్రల్లో నటిస్తున్నాడు.
జానపద చిత్రాల హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో కత్తి కాంతారావు తర్వాత రోజుల్లో పరిస్థితి మారిపోవడంతో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కాంతారావుకి ఎలాగైనా తన వారసులను సినిమాల్లోకి తీసుకురావాలని ఒక కోరిక ఉందట. దాంతో తన మనవడిని చిన్నప్పుడే బాలనటుడిగా స్వాతిముత్యం సినిమా ద్వారా ఎంట్రీ ఇప్పించారు. స్వాతిముత్యం సినిమాలో రాధిక , కమలహాస్సన్ కి ధీటుగా నటించిన బుడ్డోడు కార్తీక్ మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత మళ్ళీ సినిమాల జోలికి రాలేదు.
అది ఏ పాత్ర అయినా కావచ్చు అందులో తన నటవిశ్వరూపం ప్రదర్శించే ఎస్వీ రంగారావు డైలాగ్ డెలివరీ, హావభావాలు పలికించడం మళ్ళీ ఎవరికీ రాలేదు. రాదు కూడా. అవలీలగా డైలాగులు చెప్పే ఎస్వీఆర్ నిజంగా మహానటుడే. అయితే ఆయన సినిమాల్లో ఉండగానే కొడుకును ఇండస్ట్రీకి తేవాలని చేసిన ప్రయత్నం సఫలం కాకుండానే ఆయన ఈలోకాన్ని విడిచారు. అయితే ఆయన మనవడు ఎల్7 అనేమూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. సొంత బ్యానర్ లోనే తెలుగులో ఒకటి రెండూ సినిమాలు తీస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు

