NTR Vidya Sankalpam Scheme:ఏపీలో డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకం.. రూ.లక్ష వరకు లోన్..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తమ సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్న ఈ ప్రభుత్వం, తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
డ్వాక్రా సంఘాల్లోని మహిళల పిల్లల విద్యకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళల పిల్లల విద్యా అవసరాల కోసం అతి తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందించేలా రూపొందించారు.
ఈ పథకం కింద, డ్వాక్రా మహిళల పిల్లల విద్య కోసం 4% వడ్డీతో రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణాలు విద్యార్థుల విద్య సజావుగా కొనసాగేందుకు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా, అధిక వడ్డీతో ప్రైవేటు రుణాలు తీసుకోకుండా నిరోధించేందుకు ఉద్దేశించబడ్డాయి.
ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) నోడల్ విభాగంగా అమలు చేస్తోంది.
ముఖ్య సమాచారం:
– రుణ మొత్తం: రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు
– వడ్డీ రేటు: 4% (35 పైసలు)
– చెల్లింపు విధానం: వాయిదాల రూపంలో
– గడువు: 24 నుంచి 36 నెలల్లో రుణం చెల్లించాలి
ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం విధివిధానాలు:
1. రుణం పొందాలనుకునే మహిళలు తప్పనిసరిగా డ్వాక్రా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండాలి.
2. విద్యార్థులు 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఏ స్థాయిలోనైనా చదువుతూ ఉండాలి.
3. ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలు/కళాశాలల్లో చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
4. స్త్రీనిధి కార్యక్రమంతో అనుసంధానించబడిన ఈ పథకం ద్వారా రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు రుణం మంజూరవుతుంది.
5. రుణాన్ని 24 నుంచి 36 నెలల్లో వాయిదాల రూపంలో చెల్లించాలి.
6. రుణ మొత్తాన్ని విద్యకు సంబంధించిన ఖర్చులు (యూనిఫామ్, పుస్తకాలు, ఫీజులు, ఇతర విద్యా అవసరాలు) కోసం మాత్రమే ఉపయోగించాలి. దీనికి సంబంధించిన రసీదులు అధికారులకు సమర్పించాలి.
7. విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం సైకిల్ కొనుగోలుకు కూడా ఈ రుణం వర్తిస్తుంది.
8. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు SERP ద్వారా లేదా డ్వాక్రా స్త్రీనిధి అధికారులను సంప్రదించాలి.

