Devotional

Tirumala: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. ఇకపై సులభంగా తిరుమల శ్రీవారి లడ్డూలు… ఇలా..

తిరుమల భక్తులకు ఇది గొప్ప శుభవార్త! ఇకపై శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం క్యూలలో నిరీక్షించాల్సిన అవసరం లేదు. లడ్డూ కౌంటర్లలో రద్దీ, సమయ వృథాను తగ్గించేందుకు టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. డిజిటల్ విధానంలో టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు కొత్త కియోస్క్‌లను ఏర్పాటు చేసిన టీటీడీ, ఈ విధానాన్ని ఆదివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.

భక్తులు తమ దర్శన టికెట్ నంబర్‌ను నమోదు చేసి, కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంచుకుని, యూపీఐ ద్వారా చెల్లింపు చేయాలి. ఆ రసీదుతో లడ్డూ కౌంటర్‌లో ప్రసాదం పొందవచ్చు. ఈ విధానాన్ని కొన్ని రోజులు పరిశీలించి, లోపాలుంటే సవరణలు చేయనున్నారు.

భక్తులు 10 నుంచి 15 లడ్డూల వరకు తీసుకోవచ్చు, అయితే నిల్వ ఆధారంగా ఈ సంఖ్య మారవచ్చు. దర్శన టికెట్ లేని వారు ఆధార్ నంబర్‌తో రెండు లడ్డూలు పొందవచ్చు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కియోస్క్‌లు లడ్డూ కౌంటర్ల సమీపంలో, అలాగే MBC విచారణ కేంద్రం, CRO కేంద్రం, శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లలో అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి, కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,254 మంది శ్రీవారిని దర్శించగా, 33,777 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు. టైమ్ స్లాట్ దర్శనానికి 6 గంటలు, టికెట్ లేని వారికి 24 గంటల సమయం పడుతోంది.