Devotional

Tirumala Annaprasadam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఉచిత అన్నప్రసాదంపై కీలకమైన అప్ డేట్..

Tirumala Annaprasadam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఉచిత అన్నప్రసాదంపై కీలకమైన అప్ డేట్.. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త… టీటీడీ ఉచిత అన్నప్రసాదం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదం అందించే లక్ష్యంతో టీటీడీ మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…

టీటీడీ అన్నప్రసాద కేంద్రాల్లో ఇప్పటివరకు మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే వడలు అందించగా, ఇకపై రాత్రి భోజన సమయంలోనూ వడలు వడ్డించనున్నారు. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది.

ఈ సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను ఉంచి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు.

ఈ సందర్భంగా భక్తులతో అన్నప్రసాదం మరియు వడల రుచి గురించి అడిగినప్పుడు, భక్తులు రుచి చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారని టీటీడీ తెలిపింది. చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, నూతన ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదం అందించేందుకు ఈ చర్యలు చేపట్టామని, ఇప్పటికే మధ్యాహ్నం వడలు అందిస్తున్నప్పటికీ, ఇకపై రాత్రి భోజన సమయంలోనూ వడలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం రోజుకు 70,000 నుంచి 75,000 వడలను తయారు చేసి భక్తులకు అందిస్తున్నామని, శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, సోంపు వంటి పదార్థాలతో రుచికరంగా వడలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. అన్నప్రసాద కేంద్రంలో భోజన నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఈ చర్యలు కొనసాగుతాయని చైర్మన్ తెలిపారు.

తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు వడలతో కూడిన అన్నప్రసాదం అందుబాటులో ఉంటుందని టీటీడీ పేర్కొంది.