Business

AP Annadata Sukhibhava – PM Kisan: ఏపీలో రైతుల అకౌంట్లలోకి డబ్బులు ఆగస్టు 2న జమ.. మీరు అర్హులేనా?

AP Annadata Sukhibhava – PM Kisan: ఏపీలో రైతుల అకౌంట్లలోకి డబ్బులు ఆగస్టు 2న జమ.. మీరు అర్హులేనా.. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు శుభవార్త… అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 7,000 జమ చేసేందుకు తేదీ ఖరారైంది.

ఆగస్టు 2న ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే, ఈ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌లో సులభంగా ఆధార్ కార్డు నంబర్‌ను ఎంటర్ చేసి, అర్హత ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేస్తోంది. ఈ సందర్భంగా ఆగస్టు 2న పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం, అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయనున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ కింద రూ. 2,325 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ. 831.60 కోట్లు, మొత్తం రూ. 3,156 కోట్లను రాష్ట్రవ్యాప్తంగా 46.50 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.

అన్నదాత సుఖీభవ పథకం గురించి
ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ. 20,000 జమ చేయనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 (పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున), రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000 వాటా ఇస్తుంది. మొదటి రెండు విడతల్లో రూ. 7,000 (కేంద్రం రూ. 2,000 + రాష్ట్రం రూ. 5,000), మూడో విడతలో రూ. 6,000 (కేంద్రం రూ. 2,000 + రాష్ట్రం రూ. 4,000) జమ చేయబడతాయి.

అన్నదాత సుఖీభవ లబ్దిదారుల జాబితా
ఈ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం అధికారికంగా అందుబాటులో ఉంచింది. రైతులు అన్నదాత సుఖీభవ అధికారిక పోర్టల్ ద్వారా లేదా రైతు సేవా కేంద్రాలను సంప్రదించి తమ అర్హతను తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సులభంగా స్టేటస్ తనిఖీ చేయవచ్చు.

అన్నదాత సుఖీభవ స్టేటస్ తెలుసుకునే విధానం
అధికారిక వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ ను సందర్శించండి.
“Know Your Status” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి “సెర్చ్” చేయండి.
రైతు పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్, అర్హత/అనర్హత వివరాలు, ఈ-కేవైసీ స్టేటస్ కూడా చూపబడతాయి.

ఈ విధంగా రైతులు తమ అర్హతను సులభంగా తెలుసుకోవచ్చు.