Weekly Horoscope September 14 to 20 :ఈ వారం ఈ రాశులకు అనుకోని అదృష్టం రాబోతుంది..
Weekly Horoscope September 14 to 20 :ఈ వారం ఈ రాశులకు అనుకోని అదృష్టం రాబోతుంది.. ఈ వారం గురువు మిథున రాశిలో, శని మీన రాశిలో, రాహువు కుంభ రాశిలో, రవి, బుధ, కేతువులు సింహ రాశిలో ఉన్నారు. కన్యా రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో శుక్రుడు సంచరిస్తుండగా, చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశులకు వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
మేష రాశి:
ఈ వారం గ్రహబలం సామాన్యంగా ఉంది. కేతు, రవి వ్యతిరేక దృష్టి వల్ల పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. వ్యాపారులకు ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. స్నేహితులను నమ్మి కొత్త పెట్టుబడులు చేయవద్దు. జీవిత భాగస్వామి సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఆదివారం, సోమవారం, బుధవారం అనుకూల రోజులు. నిత్యం శివారాధన మంచి ఫలితాలనిస్తుంది.
వృషభ రాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంలో మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ అవకాశాలు సాధ్యం. వ్యాపారులకు, వృత్తి నిపుణులకు లాభదాయక కాలం. జీవిత భాగస్వామితో సంతోషకర సమయం గడుస్తుంది. అనవసర ఖర్చులు నివారించండి. స్నేహితుల నుండి దూరంగా ఉండటం మంచిది. అమ్మవారి ఆరాధన, గణపతి గరిక పూజ, సోమవారం శివ దర్శనం శుభ ఫలితాలనిస్తాయి.
మిథున రాశి:
గ్రహబలం అద్భుతంగా ఉంది. సోమవారం, బుధవారం అత్యంత అనుకూల రోజులు. వ్యాపారంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. గురువారం వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. అమ్మవారి దర్శనం, గురువారం శివాలయంలో అభిషేకం ఇబ్బందులను తొలగిస్తుంది.
కర్కాటక రాశి:
గ్రహబలం పాక్షికంగా అనుకూలం. కొత్త ఆలోచనలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడం కష్టం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోమవారం, శుక్రవారం, శనివారం అనుకూల రోజులు. బుధవారం వ్యాపారులకు లాభదాయకం. పిల్లల చదువుపై శ్రద్ధ వహించండి. అనవసర ఖర్చులను నియంత్రించండి. శివారాధన, బుధవారం గణపతికి గరిక సమర్పణ శుభ ఫలితాలనిస్తాయి.
సింహ రాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది, కానీ బుధుడి ప్రభావం తగ్గడం వల్ల వ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో మంజూరవుతాయి. సోమవారం, మంగళవారం అనుకూల రోజులు. ప్రయాణాల్లో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. స్నేహితులతో సంతోషకర సమయం గడుస్తుంది. విష్ణు సహస్రనామ పఠనం, వెంకటేశ్వర దర్శనం, మంగళవారం హనుమంతునికి ఆకు పూజ ఇబ్బందులను తగ్గిస్తాయి.
కన్యా రాశి:
గ్రహబలం చాలా అనుకూలం. బుధుడి సానుకూల దృష్టి వల్ల ఉద్యోగులకు సహోద్యోగుల, అధికారుల మద్దతు లభిస్తుంది. ప్రమోషన్లకు అవకాశం ఎక్కువ. వ్యాపారులకు ఆర్థిక లాభాలు. వారం ప్రారంభంలో మానసిక ఒత్తిడి ఉండవచ్చు. పెద్దల ఆశీర్వాదాలు ఉపయోగపడతాయి. బుధవారం శుభవార్త వినే అవకాశం. విష్ణు సహస్రనామ జపం, గణేశ ఆరాధన శుభ ఫలితాలనిస్తాయి.

తులా రాశి:
బుధుడి అనుకూల దృష్టి వల్ల ఈ వారం శుభ ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారులకు ఆర్థిక లాభాలు. ఆరోగ్యం బాగుంటుంది. బుధవారం, గురువారం, శుక్రవారం అనుకూల రోజులు. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు నివారించండి. అనవసర ఖర్చులు చేయవద్దు. దుర్గామాత ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.
వృశ్చిక రాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషకర సమయం. బ్యాంకు వ్యవహారాలు పూర్తవుతాయి. ఉద్యోగులు పని ప్రదేశంలో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. శనివారం అనుకూలం కాదు. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, మంగళవారం రాహుకాలంలో అమ్మవారి దర్శనం శుభ ఫలితాలనిస్తాయి.
ధనూ రాశి:
గ్రహబలం చాలా అనుకూలం. వ్యాపార వృద్ధికి ప్రణాళికలు రచిస్తారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆదివారం, సోమవారం, శనివారం అనుకూల రోజులు. జీవిత భాగస్వామితో చిన్న వాగ్వివాదాలు రావచ్చు, మౌనంగా ఉండండి. పిల్లల విషయంలో, మంగళవారం జాగ్రత్త అవసరం. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభ ఫలితాలనిస్తుంది.
మకర రాశి:
కుజుడి అనుకూల దృష్టి వల్ల అద్భుత అవకాశాలు వస్తాయి. నిర్ణయాత్మక సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపార భాగస్వాముల మద్దతు, ఆర్థిక లాభాలు లభిస్తాయి. గురువారం ధన లాభాలు ఎక్కువ. ఆగ్రహం, అతివిశ్వాసం వల్ల స్నేహితులతో సంబంధాలు దెబ్బతినవచ్చు, జాగ్రత్త. నిత్య శివారాధన గొప్ప ఫలితాలనిస్తుంది.
కుంభ రాశి:
గ్రహబలం పాక్షికంగా అనుకూలం. ఒదిగి ఉండటం విజయానికి మార్గం. ఉద్యోగ పరంగా శుభవార్త వింటారు. ఇంటర్వ్యూలకు అనుకూల కాలం. వ్యాపారులకు లాభాలు ఉన్నప్పటికీ, కొత్త వ్యాపారాలకు సమయం అనుకూలం కాదు. ఖర్చులు పెరుగుతాయి, తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మంగళవారం అనుకూలం కాదు. శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ ఇబ్బందులను తొలగిస్తాయి.
మీన రాశి:
గ్రహబలం పాక్షికంగా అనుకూలం. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు, ఉద్యోగులకు పని ఒత్తిడి ఉండవచ్చు. అగ్రిమెంట్లలో జాగ్రత్త అవసరం. వారం మధ్య నుంచి ఫలితాలు మెరుగవుతాయి. బుధవారం వ్యాపారులకు అనుకూలం. గురు, శుక్రవారాలు సామాన్యం. విద్యార్థులకు ఈ వారం మంచి కాలం. విష్ణు సహస్రనామ జపం శుభ ఫలితాలనిస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

