Devotional

Atla Taddi 2025: అచ్చ తెలుగు అమ్మాయిల పండగ అట్లతద్ది.. అట్లతద్ది నోము కథ.. పూజ విధానం..

Atla Taddi 2025: అచ్చ తెలుగు అమ్మాయిల పండగ అట్లతద్ది.. అట్లతద్ది నోము కథ.. పూజ విధానం.. అట్లతద్ది అనేది తెలుగు స్త్రీలు ఆచరించే ఒక పవిత్రమైన నోము. పెళ్లైన స్త్రీలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం, పెళ్లికాని యువతులు మంచి జీవిత భాగస్వామి కోసం ఈ నోమును ఆచరిస్తారు. ఈ పండుగ రోజున గౌరీ దేవిని, చంద్రుడిని పూజిస్తారు. ఈ సంవత్సరం అట్లతద్ది పండుగ అక్టోబర్ 9, 2025, గురువారం నాడు జరుపుకోనున్నారు.

అట్లతద్ది నోము విధానం
ఈ రోజున స్త్రీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. సాయంత్రం 11 అట్లు, బెల్లం ముక్కను ముత్తైదువులకు వాయినంగా ఇచ్చి, చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. అట్లతద్ది రోజున ఉయ్యాలలో ఊగడం కూడా ఒక సంప్రదాయం. ఈ నోములో ఒక రాకుమారి కథను చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

రాకుమారి కథ
ఒక ఊరిలో రాజుకు సుకుమారి అనే అందమైన కుమార్తె ఉండేది. ఆమెకు వెలమ, బ్రాహ్మణ, కోమటి, కాపు జాతులకు చెందిన నలుగురు స్నేహితురాళ్లు ఉండేవారు. అట్లతద్ది నోము ఆచరిస్తే అందమైన, ఆరోగ్యవంతమైన భర్త లభిస్తాడని పెద్దలు చెప్పగా, సుకుమారి తన స్నేహితురాళ్లతో కలిసి ఈ నోమును చేపట్టింది.అట్లతద్ది రోజున సుకుమారి నీరు కూడా తాగకుండా ఉపవాసం చేసింది.

కానీ, మూడు జాముల తర్వాత ఆమెకు కళ్లు తిరిగి కిందపడిపోయింది. దీనికి కారణం తెలుసుకున్న ఆమె అన్నలు, చెల్లెలు చంద్రుడు కనిపించే వరకు ఉపవాసంతో ఉండలేదని భావించారు. చెల్లిపై ప్రేమతో, వారు ఆరిక కుప్పకు నిప్పు పెట్టి, ఆ మంటను అద్దంలో చూపించి చంద్రుడు వచ్చాడని నమ్మించారు. దీంతో సుకుమారి భోజనం చేసింది. కానీ, ఆమె స్నేహితురాళ్లు చంద్రుడిని చూసిన తర్వాతే ఉపవాసం విరమించారు.

కొంతకాలం తర్వాత, సుకుమారికి పెళ్లి చేయడానికి అన్నలు సంబంధాలు చూశారు. ఎంత వెదికినా వృద్ధులైన పెళ్లికొడుకులు మాత్రమే దొరికేవారు. అయితే, ఆమె స్నేహితురాళ్లకు యవ్వనంలో ఉన్న భర్తలు లభించారు. చివరకు, అన్నలు సుకుమారిని ఒక వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసిన సుకుమారి, అట్లతద్ది నోము చేసినవారికి యవ్వన భర్త రావాల్సిందని, తనకు మాత్రం వృద్ధుడు దొరకడం బాధ కలిగించిందని చెప్పింది. అయినప్పటికీ, అన్నలు బలవంతంగా పెళ్లి జరిపించాలని నిశ్చయించారు.

రాకుమారి తపస్సు
దీంతో, సుకుమారి ఒక రాత్రి ఊరి చివరలోని ఒక చెట్టు కింద తపస్సు చేసింది. అప్పుడు అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూసి, “అడవిలో ఒంటరిగా తపస్సు చేస్తున్నావు, ఎందుకు?” అని అడిగారు. దానికి సుకుమారి, “మీరు ఆర్చేవారా? తీర్చేవారా?” అని ప్రశ్నించింది. “మేము తీర్చేవారమే” అని చెప్పి, ఆమె కష్టం గురించి అడిగారు. సుకుమారి జరిగిన విషయాలను వివరించింది.

పార్వతీ పరమేశ్వరులు, అట్లతద్ది నోము సమయంలో అన్నలు చేసిన పొరపాటు వల్ల ఈ సమస్య వచ్చిందని, యథావిధిగా నోమును ఆచరిస్తే యవ్వన భర్త లభిస్తాడని చెప్పి అదృశ్యమయ్యారు. దీంతో సుకుమారి ఇంటికి వెళ్లి, జరిగిన విషయాన్ని అన్నలకు చెప్పింది. వారు సక్రమంగా అట్లతద్ది నోమును జరిపించారు. ఫలితంగా, సుకుమారికి అందమైన, ఆరోగ్యవంతమైన భర్త లభించి, ఆమె సుఖమైన జీవితం గడిపింది.

గమనిక: ఈ వివరాలు కొందరు పండితులు, నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా రాయబడ్డాయి. ఇది మత విశ్వాసాలపై ఆధారపడిన సమాచారం మాత్రమే. దీనినిchaipakodi ధృవీకరించలేదు.