Devotional

Diwali 2025:దీపావళి రోజున తులసిని ఈ విధంగా పూజిస్తే సిరిసంపదలు లభిస్తాయి..

Diwali 2025:దీపావళి రోజున తులసిని ఈ విధంగా పూజిస్తే సిరిసంపదలు లభిస్తాయి..దీపావళి పండుగ హిందువులకు అత్యంత పవిత్రమైన, ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఒకటి. ఈ రోజున చీకట్లను తొలగించి దీపాల వెలుగుతో ఆనందాన్ని పంచే ఈ పండుగను పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున దీపావళిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు, లక్ష్మీదేవి, గణపతిని పూజిస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల జీవితంలో సంతోషం, శాంతి, సిరిసంపదలు, అదృష్టం కలుగుతాయని, ఆ ఇంటి సభ్యులపై ఆమె ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం.

అంతేకాదు, ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక ఆచారాలు కూడా ఆచరిస్తారు. వీటిలో తులసి మొక్కను పూజించడం చాలా ముఖ్యమైనది. నమ్మకాల ప్రకారం, దీపావళి రోజున తులసిని సంప్రదాయబద్ధంగా పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది.

దీపావళి 2025 ఎప్పుడు?
వేద క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అమావాస్య అక్టోబర్ 20, 2025న తెల్లవారుజామున 03:44 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 21న ఉదయం 05:54 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 20న జరుపుకుంటారు.
దీపావళి రోజున తులసి పూజ ఎలా చేయాలి?

తులసి దగ్గర దీపం వెలిగించడం
దీపావళి రోజున తులసి మొక్క దగ్గర దేశీ ఆవు నెయ్యితో దీపం వెలిగించి, మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఈ ఆచారం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది, ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది, సురక్షితమైన జీవితాన్ని అందిస్తుంది.

తులసి పూజ
ఉదయం స్నానం చేసిన తర్వాత, తులసి మొక్కను పూజించాలి. వైవాహిక జీవితంలో ఆనందం కోసం తులసి మొక్కకు పసుపు, కుంకుమ, గాజులు, రవిక సమర్పించి పూజ చేయాలి. ఆవు పాలతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా అర్పించాలి. ఈ వస్తువులను వివాహిత స్త్రీకి వాయినంగా ఇవ్వడం వల్ల దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి.

తులసికి గంగాజల సమర్పణ
దీపావళి రోజున కొద్దిగా గంగాజలం కలిపిన నీటిని తులసి మొక్కకు సమర్పించాలి. తులసి మంత్రాలను జపించడం కూడా శుభప్రదం. ఈ విధంగా పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి, నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి, శుభ ఫలితాలు కలుగుతాయి.

గమనిక: ఈ సమాచారం మత విశ్వాసాలు, పండితుల సూచనల ఆధారంగా అందించబడింది. ఇందులో శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. ఈ సమాచారాన్ని పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే అందించడం జరిగింది.