చేతిలో రూ.3 వేలు ఉంటే చాలు.. అరుణాచలం, తిరుపతి వెళ్లి రావొచ్చు! 3 రోజుల పక్కా ప్లాన్ ఇదే..
Arunachalam Tirupati Tour: చేతిలో రూ.3 వేలు ఉంటే చాలు.. అరుణాచలం, తిరుపతి వెళ్లి రావొచ్చు! 3 రోజుల పక్కా ప్లాన్ ఇదే..వేసవి సెలవుల్లో దైవ దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చులో అరుణాచలం, తిరుపతి ప్లాన్ చేస్తున్నారా? అయితే కేవలం రూ.3 వేలతో 3 రోజుల్లో ఈ రెండు మహా పుణ్యక్షేత్రాలను చుట్టిరావొచ్చు. అదెలాగో ఈ డీటెయిల్డ్ 3-డేస్ ట్రిప్ ప్లాన్ చూసేయండి.
డే 1: పయనం ఇలా.. (రైలు మార్గం)
హైదరాబాద్ నుంచి: ప్రతీ సోమవారం కాచిగూడ-ట్యూటికోరిన్ ఎక్స్‌ప్రెస్, మంగళవారం చర్లపల్లి-తిరుచిరాపల్లి స్పెషల్, బుధవారం హైదరాబాద్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
ఏపీ (విశాఖ) నుంచి: ఖరగ్‌పూర్-విల్లుపురం (శుక్రవారం), పురులియా-తిరునల్వేలి (మంగళ, శని), హౌరా-పుదుచ్చెరి (సోమవారం) ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యామ్నాయం: డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే.. తిరుపతి లేదా కాట్పాడి జంక్షన్‌కు చేరుకుని, అక్కడి నుంచి బస్సులో తిరువన్నామలై వెళ్లొచ్చు. ట్రైన్ టికెట్‌కు సుమారు రూ.500 ఖర్చవుతుంది.
డే 2: గిరి ప్రదక్షిణ & తిరుపతికి పయనం
మధ్యాహ్నానికి తిరువన్నామలై చేరుకుంటారు. వసతి కోసం బడ్జెట్ హోటల్ (రూ.500) లేదా డార్మిటరీ తీసుకోవచ్చు.
ఎండలు ఉన్నాయి కాబట్టి, సాయంత్రం లేదా మరుసటి రోజు తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ చేయడం ఉత్తమం. దీనికి 4 గంటల సమయం పడుతుంది.
అరుణాచలేశ్వరుని దర్శనం పూర్తయ్యాక, తిరుపతికి బస్సు ఎక్కాలి (టికెట్ రూ.200 – రూ.300). రెండో రోజు రాత్రికి తిరుపతి చేరుకుంటారు.
డే 3: శ్రీవారి దర్శనం & రిటర్న్ జర్నీ
తిరుపతి చేరుకున్నాక టీటీడీ (TTD) లాకర్లలో లగేజీ భద్రపర్చుకుని, స్థానిక ఆలయాలు దర్శించుకోండి.
మూడో రోజు తెల్లవారుజామున తిరుమల చేరుకుని, ఉచిత దర్శనం క్యూలైన్‌లో శ్రీవారిని దర్శించుకోండి.
అదే రోజు రాత్రి తిరుపతిలో రిటర్న్ ట్రైన్ ఎక్కితే, మరుసటి రోజు ఉదయానికి మీ ఇల్లు చేరుకుంటారు.
ఖర్చుల పక్కా లెక్కలివే (రూ.3000 బడ్జెట్):
వెళ్లేందుకు రైలు ఛార్జీ: రూ.500
తిరువన్నామలైలో ఆటో, స్థానిక ప్రయాణం: రూ.300
వసతి (బడ్జెట్ హోటల్/డార్మిటరీ): రూ.500
అరుణాచలం టు తిరుపతి బస్సు: రూ.300
తిరుపతి నుంచి తిరుమల (అప్ అండ్ డౌన్): రూ.300
తిరుగు ప్రయాణానికి ట్రైన్ టికెట్: రూ.400
భోజనం, ఇతర చిన్నచిన్న ఖర్చులు: రూ.700
మొత్తం ఖర్చు: రూ. 3,000
స్మార్ట్ టిప్స్: ఈ బడ్జెట్‌లో మీ ట్రిప్ పూర్తి కావాలంటే.. ప్రైవేట్ రూమ్స్ బదులు లాకర్లు, డార్మిటరీలు వాడాలి. అలాగే బయట హోటల్స్ బదులు ఆలయాల్లోని ఉచిత అన్నప్రసాదం స్వీకరిస్తే ఖర్చు బాగా ఆదా అవుతుంది. అన్నిటికంటే ముఖ్యం, ముందుగానే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడం మర్చిపోకండి!

