Health

ముఖ వర్చసు పెంచే జలంధర బంధం

గడ్డం భాగాన్ని ముడుచుకొనేలా చేసే ఆసనం గనుక దీన్ని జలంధర బంధం అంటారు.
ఈ ఆసనం ఎలా వేయాలి?
1. పద్మాసనంలో కూర్చోవాలి. వెన్ను, మెడ నిటారుగా వుండాలి. అరచేతులను మోకాళ్ళపై వుంచాలి.
2. ఇప్పుడు నిండుగా శ్వాసను తీసుకోవాలి. ఆ శ్వాసను లోపలే ఆపి తలను కిందికి వంచి గెడ్డాన్ని ఛాతీకి అదిమి వుంచాలి.
3. ఈ స్థితిలో వుండగలిగినంత సేపు ఉండి తలఎత్తి యథాస్థితికి రావాలి. తొలిసారి చేసేవారు 5 సెకన్లు శ్వాస నిలిపి సమయాన్ని నెమ్మదిగా పెంచుకోవాలి. ఇలా 2 లేదా 3 సార్లు చేయవచ్చు. గాలి పీల్చి బిగబట్టినప్పుడు చేతులూ కాస్త చాచుకోవచ్చు.
4. శ్వాసను లోపల నింపి చేసినట్లే శ్వాసను బయటికి వదిలి కూడా చేయవచ్చు.

ఉపయోగాలు
థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది.
జీవక్రియలు వేగం పుంజుకొంటాయి.
ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది.
గొంతు సమస్యలు రాకుండా చూస్తుంది.
మనస్సు తేలిక పడుతుంది. కోపము, ఒత్తిడి వదిలిపోతాయి.
ముఖ కండరాలకు శక్తిని చేకూర్చి, అందంగా కనిపించేలా చేస్తుంది.

గమనిక: మెడనొప్పి, తలతిరుగుడు, హైబిపి, గుండె జబ్బులున్న వారు దీన్ని చేయరాదు.