దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ఏ రంగు పూలతో పూజ చేయాలి? బొమ్మలకొలువు ఎలా పెట్టాలి?
దసరా నవరాత్రులు అక్టోబర్ 10 బుధవారం నుండి ప్రారంభం అవుతున్నాయి. ప్రతి ఒక్కరు దసరా నవరాత్రులను చాలా నియమ నిష్టలతో చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే సకల సంపదలు,మానసిక ప్రశాంతత, పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో అవతారంతో అమ్మవారు దర్శనం ఇస్తారు. నవరాత్రులు ఆశ్వయిజ శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు అమ్మవారిని పసుపు రంగు చీరతో అలంకరణ చేయాలి. పసుపు రంగు పూలతో పూజ చేయాలి.
చక్కెరపొంగళి నైవేద్యం పెట్టాలి. అలాగే దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అఖండ దీపారాధన చేస్తారు. ఈ దీపారాధన నవరాత్రి తొమ్మిది రోజులు వెలుగుతూ ఉండాలి. బొమ్మలకొలువు కూడా దసరా నవరాత్రుల మొదటి రోజు పెట్టి తొమ్మిది రోజులు ఉంచుతారు. అయితే కొంతమంది మూడు రోజులు బొమ్మలకొలువు పెడుతూ ఉంటారు. మూల నక్షత్రం సరస్వతి అమ్మవారి పూజ రోజు,దుర్గాష్టమి,మహర్నవమి ఈ మూడు రోజులు బొమ్మలకొలువు పెడతారు. కొన్ని ప్రాంతాలలో సంక్రాతి రోజు బొమ్మలకొలువు పెడుతూ ఉంటారు.
దీని అలంకరణకు తొమ్మిది మెట్లుంటాయి. వారి కళాదృష్టి, ఆర్థిక స్తోమత, సౌకర్యాలను బట్టి వాళ్ళు ఈ మెట్లపై రకరకాల బొమ్మలను అమరుస్తారు.పై మెట్లపై దేవుళ్ళ బొమ్మలను ఉంచుతారు. అమ్మవారి బొమ్మలు కూడా వుంచే ఈచోటుని సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు. కింద వున్న మెట్లు పై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు వుంచుతారు. అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు.
మధ్య భాగములో క్షత్రియధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి, యుద్ధవీరుల వంటి బొమ్మల నుంచుతారు. ఇక అన్నిటికన్నా పై మెట్టుమీదవుంచే కలశం దేవీ కరుణకు సూచనగా బావిస్తారు. ఈ మూడు గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షము లభ్యమవుతుందని అంటారు. ఇదీ బొమ్మలకొలువు తత్వము. మెట్ల పై తెల్లని వస్త్రము పరచి ఆ పై బొమ్మలను అమర్చుతారు.