Movies

కమెడియన్ రాజబాబు కొడుకులు ఇప్పుడు ఎక్కడ ఎలా ఏ స్థితిలో ఉన్నారో తెలుసా?

తెలుగు వెండితెరమీద హాస్య నటుల పేర్లు చెబితే,అప్పట్లో రేలంగి తర్వాత అంతటి పాపులార్టీ తెచ్చుకున్న కమెడియన్ రాజబాబు. ఈయన తెరమీద కనిపిస్తే,చాలు పగలబడి నవ్వేసేవారట. ఇక యాక్షన్ అయితే చెప్పక్కర్లేదు. తన హావభావాలతో అందరినీ ఆకట్టుకున్న మేటి హాస్య నటుడు. ఆనాటి అగ్రహీరోల సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న కమెడియన్ ప్లస్ హీరో కూడా రాజబాబు అని చెప్పాలి. పశ్చిమ గోదావరి నరసాపురంలో జన్మించిన రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. ఇంటర్ వరకు చదివి,తెలుగు పండిట్ ట్రైనింగ్ అయి, టీచర్ గా పనిచేసేవాడు. అయితే సినిమాలపై మోజుతో ఎవరికీ చెప్పాపెట్టకుండా మద్రాస్ చెక్కేసి, అక్కడ సినిమా వాళ్ళ పిల్లలకు ట్యూషన్స్ చెప్పేవాడు.

అలా సినిమావాళ్ళ పరిచయం రాజబాబుని సిల్వర్ స్క్రీన్ మీద మెరిసేలా చేసింది. సమాజం మూవీతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి, తన పేరుని రాజబాబుగా మార్చుకున్నాడు. బక్కపలచగా ఉండే రాజబాబు సినిమాల్లో బానే క్లిక్ అయ్యాడు. తండ్రులు -కొడుకులు,కులగోత్రాలు,స్వర్ణ గౌరీ,మంచి మనిషి, వంటి చిత్రాలతో ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు.

ఆరోజుల్లో అగ్ర హీరోలతో సమానంగా లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే రాజబాబు ఇంద్ర భవనం లాంటి ఇంట్లో ఉండేవాడు. పెద్ద హీరోల దగ్గర ఎలాంటి కారులు ఉండేవో రాజబాబు దగ్గర కూడా అలాంటివే ఉండేవి. దర్జా లైఫ్ అనుభవించాడు. అంతస్తులు అనే మూవీలో కేవలం 1300రూపాయలు మాత్రమే పారితోషికం అందుకున్న రాజబాబు,ఆతర్వాత రమాప్రభతో కల్సి నటించడంతో హిట్ ఫెయిర్ గా పేరొచ్చింది. ఇల్లు ఇల్లాలు వంటి చిత్రాలు ఆరోజుల్లో రాజబాబు కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి.

తప్పనిసరిగా ఓ పాట రాజబాబు కోసం పెట్టాల్సిందే అన్నట్టు మారిపోయింది. ఈవిధంగా హీరోల లెవెల్లో రెమ్యునరేషన్ పెరిగింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను తన హాస్య నటనతో ఏలిన రాజబాబు కి 1965లో లక్ష్మీ అమ్ములు తో వివాహం అయింది. వీరికి నాగేంద్రబాబు,మహేష్ బాబు అనే ఇద్దరు కుమారులున్నారు. కాగా రాజబాబు సోదరులు చిట్టిబాబు,అనంత్ కూడా హాస్య నటులుగా వున్నారు.
ఇక సొంత నిర్మాణ సంస్థ కూడా నెలకొల్పిన రాజబాబు ఎన్నో చిత్రాలు నిర్మించారు. చేతికి ఎముక లేని విధంగా దానధర్మాలు కూడా చేసారు.

సినిమాల్లో నష్టాలు రావడం,దానధర్మాలతో ఆస్తులు కరిగిపోవడంతో ఆఖరి దశలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇక చాలా దయనీయ స్థితిలో మరణించినట్లు చెబుతారు. ‘అన్నయ్య చనిపోయేనాటికి చాల చిన్నపిల్లలైన కొడుకులను వదిన కష్టపడి పెంచి, ఉన్నత స్థాయికి చేర్చింది. కొడుకులిద్దరూ చాలా కాలం కిందటే యుఎస్ లో సెటిల్ అయ్యారు.

వాళ్లకి సొంతంగా ఓ సాఫ్ట్ వేర్ సంస్థ కూడా ఉంది. ఇప్పుడు మనం చూసే జిపిఎస్ వ్యవస్థ ను అభివృద్ధి చేసిన టీమ్ లో వాళ్లిద్దరూ కూడా ఉన్నారు. యుఎస్ లో వాళ్ళుండే ఇంటి విలువ 10కోట్ల పైమాటే. ఇక ఇండియాలో పాతిక కోట్ల వరకూ ఆస్తులున్నాయి. ఏడాదికొకసారి వచ్చి వెళ్తూ ఉంటారు’అని రాజబాబు సోదరుడు చిట్టిబాబు తాజాగా ఓ ఇంటర్యూలో వెల్లడించారు.