Republic Day History

రాజ్యాంగం ఆమోదం పొందటానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా?

డా|| అంబేద్కర్‌ ఆధ్వర్యంలోని కమిటీ, అహరహం శ్రమించి, ఒక లిఖిత రాజ్యాంగ ప్రతి (డ్రాఫ్ట్‌ కాన్ట్సిట్యూషన్‌) తయారుచేసి, 1947 నవంబర్‌ 4 వ తేదీన, అసెంబ్లీకి సమర్పించారు. 166 రోజుల పాటు, సామాన్య పౌరులు కూడా పాలుపంచుకోడానికి వీలైన అసెంబ్లీ సమావేశాలలో, భారత రాజ్యాంగ వ్రాత ప్రతికి ఎన్నో సుదీర్ఘమైన చర్చలలో, సవివరమైన సవరణలు ప్రతిపాదించి, మార్పులూ, చేర్పులూ చేసిన తరువాత, ఇంగ్లీష్‌లోనూ, హిందీలోనూ, విడివిడిగా రాసిన రెండు లిఖిత రాజ్యాంగ ప్రతులమీద, 1950 జనవరి 24 వ తేదీన, 308 మంది అసెంబ్లీ మెంబర్స్‌ తమ ఆమోద సూచకంగా సంతకాలు చేశారు.

ఆ తరువాత, 2 రోజులకి, అవ్యాజ దేశభక్తి పరాయణులైన అలనాటి స్వాతంత్య్ర సమరయోధుల సమ్మాన పురస్పరంగా, 1950 జనవరి 26 వ తేదీన, భారత రాజ్యాంగం, భరతావనికి మార్గదర్శకమైన సముదాత్త చట్టంగా, ప్రత్యేక ప్రతిపత్తి సంతరించుకుంది. దాంతో, భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్యంగా అవతరించింది. అసలు జనవరి 26 వ తేదీనే, భారత స్వాతంత్య్ర దినంగా పరిగణించాలని ఆశించారా అసమాన స్వాతంత్య్ర యోధులు. కాని, 1950 లో, అదే జనవరి 26 న బాబూ రాజేంద్ర ప్రసాద్‌ అధ్యక్షుడిగా, భారతదేశం ‘సావరిన్‌ డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌’ గా ఆవిర్భవించి, ప్రపంచ ప్రజాస్వామ్యదేశాలకి ఆదర్శప్రాయంకావడంతో, వాళ్ల ఆనందానికి అవధులేలేకుండా పోయాయి.