Politics

ఒకే జిల్లాలో పవన్ – రేణు పర్యటనతో వేడెక్కిన రాజకీయం

ఎన్నికల నోటిఫికేషన్ ఏదో ఒక క్షణాన విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పక్షాలు వేగం పెంచాయి. ఓ పక్క పార్టీలు మారే నేతలకు కండువాలు కప్పుతూ మరోపక్క పార్టీ గెలుపుకోసం ఎక్కడెక్కడ ఏమి చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో పోటీ తప్పనిసరి గా ఎంచుకున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచార వేగంతో దూసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కర్నూల్ జిల్లాలో పర్యటన సాగిస్తున్నాడు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని తీర్చగల నాయకుడిని ఎన్నుకునేలా చేయడమే ఈ పర్యటన వెనుక రహస్యం.

అధికార టిడిపి,విపక్ష వైస్సార్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించగా, పవన్ కూడా ధీటైన అభ్యర్థులకు కసరత్తు మొదలుపెట్టారు. కాగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా కర్నూల్ జిల్లా మంత్రాలయం వచ్చింది. యాదృచ్ఛికమో ఏమో గానీ ఒకే సారి ఒకే జిల్లాలో అందునా కర్నూల్ జిల్లాలో పర్యటించడం సహజంగా చర్చనీయాంశం అయింది. రైతుల సమస్యలపై అధ్యయనం చేస్తూ, మంత్రాలయం వచ్చిన ఆమె అక్కడి గెస్ట్ హౌస్ లో బసచేసింది.

ఒకే జిల్లాలో పర్యటిస్తున్న సరే,పవన్ -రేణు కలుసుకునే ఛాన్స్ లు లేవట. గత కొన్నేళ్లుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పేదరైతుల కుటుంబాలను పరామర్శించి వారి ఆత్మహత్యకు గల కారణాలను రేణు తెలుసుకుంటోంది. రైతుల సమస్యలను ఆమె స్వయంగా తెలుసుకుని వాటి ఆధారంగా ఓ సినిమా తీయాలని కూడా భావిస్తోందట. ఆ సినిమా వర్క్ స్క్రిప్ట్ కోసమే కర్నూల్ జిల్లాలో పర్యటన సాగిస్తోంది.