Politics

అపర చాణక్యుడు చంద్రబాబు టర్నింగ్ పాయింట్ ఏమిటో తెలుసా…. కొన్ని నమ్మలేని నిజాలు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 9 ఏళ్ళు సీఎం గా చేసి, రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8 నుండి సేవలందిస్తున్న చంద్రబాబు అపర చాణక్యునిగా రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లో ముద్ర పడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలలో కూడా అత్యధిక కాలం ప్రతిపక్షనేతగా సేవలందించారు. 4దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎదుర్కొంటూ, ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రజలకు మంచి చేకూర్చాలనే ఉద్దేశ్యంతో తన రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. ప్రస్తుతం 2019 ఎన్నికల బరిలో టీడీపీ పార్టీ అధ్యక్షునిగా ప్రత్యర్థి పార్టీలైన వైసీపీ, జనసేనలతో తలపడుతున్నారు.

ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. చిన్నతనంలోనే స్కూల్ కి నడుచుకుంటూ వెళ్లి చదువుకోవడంతో ఆయనకు రైతుల కష్టాలు, చదువు విలువ, పేదల బాధలు బాగా తెలుసు. చంద్రబాబుకు రామ్మూర్తి నాయుడు అనే తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నారావారి పల్లిలో పాఠశాల లేకపోవడంతో చంద్రబాబు ప్రాథమిక విద్యాబ్యాసం కోసం రోజూ పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్ళేవారు. అలా ప్రాధమిక విద్య పూర్తి చేసిన చంద్రబాబు, చంద్రగిరిలోని జిల్లాపరిషత్తు పాఠశాలలో చేరి 9వ తరగతి పూర్తిచేశారు.

డిగ్రీ అయ్యాక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో 1972వ సంవత్సరంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. నిజానికి చిన్నతనం నుండే ప్రజాసేవపై ఆసక్తి కనబరిచే చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగి అయి పేదవారికి సహాయం చేయాలనుకున్నారు. కానీ, ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని శాసించేది ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఒక గొప్ప రాజకీయనాయకుడు అవ్వాలనుకున్నారు.

అనుకున్నదే తడవుగా చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేశారు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరాడు. ఎప్పుడు వీలు దొరికినా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ నాయకుల నుండి ఎన్నో ప్రశంసలందుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో 20 శాతం కోటా సీట్లను యువజన విభాగానికి ఇచ్చేయడంతో అది చంద్రబాబుకు బాగా కలిసొచ్చింది.

1978వ సంవత్సరంలో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, పిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ శాసన సభలో అడుగుపెట్టి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. చంద్రబాబు సినీమాటోగ్రఫీ మంత్రిగా ఉండగా, తెలుగు సినిమా నటుడు ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు.

దాంతో బాబుకు 1981, సెప్టెంబర్ 10న ఎన్.టి.రామారావు మూడవ కుమార్తె భువనేశ్వరినిచ్చి పెళ్ళిచేసారు. ఇక అక్కడ నుండి చంద్రబాబు రాజకీయ ప్రస్థానం వేగంగా కదిలింది.ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొన్నాళ్ళకు టిడిపిలో చేరి, తన ఉనికి చాటుకున్నారు. అలా ఎన్టీఆర్ తర్వాత టిడిపి పార్టీ బాధ్యతలు తన భుజాలపై మోస్తూ 1995 సెప్టెంబర్‌ 1న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రజలవద్దకే పాలనప్రవేశపెట్టారు. 1998లో హైదరాబాద్ లోని హైటెక్‌ సిటీని ప్రారంభించి, అనతి కాలంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత చంద్రబాబుదే. ఇక మరోసారి సీఎం గా అయ్యేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న సీఎం చంద్రబాబు విజయాన్ని నమోదు చేసుకుంటారన్న ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.