నగరిలో రోజా గెలుపు ఖాయం అయినట్టే….ఇక లాంఛనమే?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి లెక్కింపునకు ఇంకా నెలకుపైగా సమయం ఉండడంతో అభ్యర్థులు ,పార్టీల వాళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఉత్కంఠ రాజ్యమేలుతోంది. సర్వేలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఇస్తున్నారు. ఆయా నియోజక వర్గాల్లో పందాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఇక వైసిపి నాయకురాలు,నటి రోజా మరోసారి బరిలో దిగిన చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గంలో సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. 2014ఎన్నికల్లో మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడుపై పోటీచేసి, స్వల్ప తేడాతో గెలిచిన రోజా ఈసారి మరింత పక్కాగా ఎన్నికల బరిలో నిలబడింది.

అయితే గాలి ముద్దుకృష్ణమ నాయుడు వారసుడు భానుప్రకాష్ ని రోజా ఎదుర్కొంది. ఇక్కడ వాస్తవానికి రోజా సీటు ముందే ఖరారయినప్పటికీ గాలి భానుప్రకాష్ పేరు మాత్రం చివరి వరకూ సస్పెన్స్ లోనే ఉండిపోయింది. ఎందుకంటే ముద్దుకృష్ణమ నాయుడు ఇంట్లోనే టికెట్ మాకంటే మాకే ఇవ్వాలని పట్టుబట్టడంతో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను చంద్రబాబు రంగంలో దించాడు. బుద్ధా రాయభారంతో భాను ప్రకాష్ కి టికెట్ ఖరారైంది. అయితే అప్పటికే రోజా ప్రచారంలో దూకుడుతో ఉంది. గాలి ఫ్యామిలిలో ఏర్పడిన దుమారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో రోజా సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు.

ముఖ్యంగా నాలుగు రూపాయలకే క్యాంటిన్ లను ప్రారంభించడం రోజాకు ప్లస్ అయింది. నియోజకవర్గంలో మొబైల్ వ్యాన్లతో క్యాంటీన్స్ నడవడంతో మంచి ఆకర్షణ ఏర్పడింది. ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ పసుపు కుంకుమ పేరిట అనుకూలంగా అందరినీ మలుచుకోవడంలో రోజా సక్సెస్ అయింది. ఎక్కడో హైదరాబాద్ లో ఉంటోందన్న టిడిపి నేతల విమర్శలను తిప్పి కొడుతూ 10కోట్లతో ఇల్లు కట్టుకుని,నియోజక వర్గంలో పేదలకు అన్నదానం వంటివి చేయడం వంటివి బాగా కల్సి వచ్చాయని అంటున్నారు. అయితే ఓటింగ్ సరళి చూస్తే ఎవరికి అనుకూలమో చెప్పడం కష్టం. లెక్కింపు చేపట్టాక గెలుపు ఎవరిని వరిస్తుందో చెప్పగలం.

