ఎమ్జీఆర్,ఎన్టీఆర్ మధ్యలో పొలిటికల్ పార్టీ పెట్టిన హీరో మరొకరన్నారు తెలుసా?
రాజకీయాలు వేరు,సినిమాలు వేరు అనే స్టేట్ మెంట్స్ తరచూ వింటూంటాం. కానీ సినీ తారలు లేని రాజకీయ పార్టీలేదు అని చెప్పవచ్చు. అందుకే మన దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. చాలా మంది నటులు సినిమాల్లో నటిస్తూనే పాలిటిక్స్‌లో ఎంటరై ఒక వెలుగు వెలిగారు. ఇక భారత దేశంలో ఒక పార్టీ పెట్టి అధికారంలో వచ్చిన సినిమా నటుల్లో తమిళ నటుడు ఎంజీఆర్ ని మొదటగా చెప్పుకోవాలి. 1972లో అప్పటి డీఎంకే పార్టీ ఛీఫ్ కరుణానిధితో విభేదించి ఏ ఐ ఏ డి ఎం కె పార్టీ స్థాపించిన ఎంజీఆర్ ఆ తర్వాత 1977లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత చనిపోయేంత వరకు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగానే కొనసాగారు.ఎంజీఆర్ తర్వాత రాజకీయ పార్టీని స్థాపించిన నటుల్లో ఎన్టీఆర్ అని అనుకుంటాం కానీ,మరో నటుడు కూడా ఉన్నారు.
ఈ విషయం చాలామందికి తెలియదు. అవును బాలీవుడ్ స్టార్ దేవానంద్ 1980లో నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ స్థాపించారు.ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పార్టీ 1980 జనరల్ ఎలక్షన్స్ తర్వాత కనిపించకుండా పోయింది. ఎందుకంటే 1977లో ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మాలనీ దేవానంద్‌ని కలిసి ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీలకు వ్యతిరేకంగా జనతా పార్టీతో కలిసి పనిచేయాలని కోరడంతో ఇందిరకు వ్యతిరేకంగా దేవానంద్ ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి రావడమే కాదు స్వయంగా ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారు. ఆ తర్వాత జనతా పార్టీలో ఏర్పడిన లుకలుకల కారణంగా జనతా పార్టీ పూర్తి కాలం అధికారంలో కొనసాగలేకపోయింది.
ఒక రకంగా జనతా పార్టీ ప్రయోగం దేశ రాజకీయాల్లో ఒక విఫల ప్రయోగంగా నిలిచిపోయింది. అయితే ఈ పరిణామాలేవీ దేవానంద్ రాజకీయ ఆసక్తిని తగ్గించ లేదు సరికదా, అప్పటికే ఎంజీఆర్ పార్టీ పెట్టి తమిళనాడలో అధికారం చేపట్టడంతో, తాను కూడా అదే రకంగా రాజకీయాల్లో రాణించగలనని బలంగా నమ్మారు. అందుకే 14 సెప్టంబర్ 1979లో నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు. దేవానంద్ పార్టీకి నెహ్రూ సోదరి విజయలక్ష్మీ మద్దతు కూడా ప్రకటించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అప్పట్లో బాంబేలోని శివాజీ పార్క్‌లో దేవానంద్ చేసిన ర్యాలీకి విశేష స్పందన లభించింది. దేవానంద్‌కు లభించిన ప్రజాదరణ చూసి ఇందిరా గాంధీ సైతం ఆయనతో కలిసి చేయాలనుకున్నా, దేవానంద్ నో అనేసారు.
1980 ఎన్నికల ముందు దేవానంద్ తన పార్టీ మేనిఫెస్టో అని ఎన్నో హామీలు ఇచ్చారు. అప్పట్లో చాలా మంది సినిమావాళ్లు సైతం దేవానంద్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన స్థాపించిన పార్టీ దేశవ్యాప్తంగా 500పైగా స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎలాంటి ప్రభావం కనిపించకపోవడంతో కలత చెందిన దేవానంద్ తన పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫలితంగా దేశ రాజకీయాల్లో మెరుపులా వచ్చిన దేవానంద్ పార్టీ అంతే వేగంగా కనుమరుగైంది.తన సినీ ప్రస్థానం, రాజకీయాల్లో పాత్ర గురించిన వివరాలను దేవానంద్ తన ఆటో బయోగ్రఫీలో వివరించారు. 2007లో దేవానంద్ 84వ బర్త్ డే రోజున తన ఆటోబయోగ్రపీ పుస్తకాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేత ఆవిష్కరింపజేశారు.
దేవానంద్ పార్టీ పెట్టిన రెండున్నరేళ్లకు తెలుగునాట మహానటుడు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి పెను సంచలనం సృష్టించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ బలంగా లేకపోవడంతో తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌కు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత వీరి స్పూర్తితో ఎంతో మంది నటులు సొంతంగా రాజకీయ పార్టీలను స్థాపించినా, ఎమ్జీఆర్, ఎన్టీఆర్ తరహాలో విజయాలు నమోదు చేసుకోలేకపోయారు.