Movies

టీవీ9 రవి ప్రకాష్‌ గురించి నమ్మలేని నిజాలు

ఒకప్పుడు వార్తలు అంటే న్యూస్ పేపర్స్. తర్వాత దూరదర్శన్‌లో రాత్రి ఏడు గంటల సమయంలో వచ్చే 15 నిమిషాల వార్తలే కీలకం. ఆ 15 నిమిషాల్లో మొత్తం ముఖ్యమైన విషయాలను కవర్‌ చేసేవారు. ఆ తర్వాత ప్రయివేట్ చానల్స్ రావడంతో ఈటీవీ, జెమిని వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ వచ్చాయి. పేపర్‌లో చూడటం కంటే ముందు రోజే ఆ వార్తల గురించి తెలుసుకోవడంకు జనాలు ఆసక్తి చూపించారు. ఆ ఛానెల్స్‌ ఉదయం, రాత్రి సమయంలో వార్తలను ప్రసారం చేసేవి. మారిన పరిస్థితులు, పెరిగిన టెక్నాలజీతో వార్తలు ఆసక్తికరంగా చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో వచ్చిందే టీవీ9. రోజులో 24 గంటలు న్యూస్‌ చూపించేందుకు రంగప్రవేశం చేసింది. రోజంతా కూడా న్యూస్‌ ఎలా చూపిస్తారని అంతా అనుకున్నారు. అది సాధ్యం అయ్యే విషయం కాదని అంతా భావించారు.కాని అసాధ్యం అనుకున్నదాన్ని టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ సుసాధ్యం చేశాడు. 

1980లలో జర్నలిస్ట్‌గా జీవితాన్ని ఆరంభించిన రవిప్రకాష్‌ ఏం చేసినా చాలా విభిన్నంగా చేయాలనే తత్వంతో ఉండేవాడు. మొదట ప్రింట్‌ మీడియాలో ఉండేవాడు. ఎప్పుడైతే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ న్యూస్‌ కాన్సెప్ట్‌ను తీసుకు వచ్చాయో రవిప్రకాష్‌ టెలివిజన్‌ రంగంకు జంప్‌ అయ్యాడు. తేజ టీవీలో వార్తల ప్రసారంకు హెడ్‌గా రవి ప్రకాష్‌ ఎంపిక అయ్యాడు. అక్కడ రవిప్రకాష్‌ సంచలన వార్తలను తీసుకు రావడంతో పాటు, వార్తలు కొత్తగా చెప్పడం, ఫీల్డ్‌లోకి వెళ్లి వార్తలను కవర్‌ చేయడం చేశాడు. ఇక అప్పట్లో బషీర్‌బాగ్‌ అప్పటి ఎపిసోడ్‌ను లైవ్‌ ద్వారా జనాలకు అందించిన ఘనత రవిది. తెలుగు రాష్ట్రంలో అప్పుడు ఒక వార్తను లైవ్‌ ఇచ్చిన మొదటి ఘనత రవి ప్రకాష్‌కు దక్కింది.

రవి ప్రకాష్‌ జీవితం ఆదర్శనీయం అని చాలామంది అంటారు. అయితే ఆయన తప్పు చేశాడు, తప్పుడు మనిషి అని కొందరికి అభిప్రాయం ఉన్నా కూడా తాను ఎంచుకున్న మార్గం, వెళ్లాలనుకున్న దారిలో సరిగ్గా వెళ్లడంతో పాటు, అనుకున్న లక్ష్యంకు పది రెట్ల ముందుకు  వెళ్లాడు. ఇప్పుడు భారతదేశంలో వచ్చిన ఎన్నో స్థానిక వార్తా ఛానెల్స్‌కు రవి ప్రకాష్‌ ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని వందల మంది ఇప్పుడు జర్నలిజంపై ఆసక్తి చూపుతున్నారంటే అది ఆయన వల్లే అనడంలో సందేహం లేదు.

తేజ టీవీలో న్యూస్‌ హెడ్‌గా చేస్తున్న సమయంలోనే సొంత ఆలోచన, అది కూడా 24 గంటల వార్త ఛానెల్‌ను తీసుకు రావాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తనకున్న పరిచయాలతో సత్యం రాజు తమ్ముడు శ్రీనిరాజు ప్రోత్సాహంతో టీవీ9ను ప్రారంభించాడు. అప్పటికి జాతీయ స్థాయిలో ఒకటి రెండు న్యూస్‌ ఛానెల్స్‌ ఉన్నాయి. అవి 24 గంటలు వార్తలు ఇవ్వడంలో కాస్త అటు ఇటుగా ఉన్నాయి. అలాంటి సమయంలో రవి ప్రకాష్‌ తీసుకు వచ్చిన టీవీ 9 అద్బుత విజయాన్ని సొంతం చేసింది ఒకవేళ రవి ప్రకాష్‌ టీవీ9 స్థాపించకుంటే ఇన్ని న్యూస్‌ ఛానెల్స్‌ పుట్టుకు వచ్చేవి కాదా అని మీరు అడగ వచ్చు. ఏమో చెప్పలేం, ఇన్ని వచ్చేవి కావేమో, కొన్ని జాతీయ స్థాయి మీడియా సంస్థలు ఇక్కడకు వచ్చేవి ఏమో. ఈ మార్పుకు, ఈ సంచలనంకు ఖచ్చితంగా రవిప్రకాష్‌ కారణం అని చాలామంది అనేమాట.