Politics

చిరంజీవి ఆమె మాట వినకపోవడం వలన ఏమైందో తెలుసా?

దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు వెండితెరను ఏలిన అందాల నటి జమున అంటే తెలియని వారుండరు. ప్రజానటిగా గుర్తింపు పొందిన సత్యభామ పాత్రకు ఆమె పెట్టింది పేరు. అంజలీదేవి,బి సరోజాదేవి,సావిత్రి లతో పోటీ పడుతూ ఆ తర్వాత వాణిశ్రీ తరంతోనూ గట్టి పోటీ ఇచ్చింది. సినిమాల్లో హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసిన ఆమె, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తన సత్తా చాటింది. ఇక రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి, రాజమండ్రి నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీచేసి గెలిచారు. 

1989లో ఎంపీగా గెలిచిన జమున 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రాజమండ్రి నుంచి మళ్ళీ బరిలో దిగి ఓటమి పాలయ్యాక మళ్ళీ రాజకీయాలవైపు చూడలేదు. తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాల్లోకి సినిమా వాళ్ళు రాకపోవడమే మంచిదన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పడు మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇదే మాట చెప్పానని ఆమె గుర్తుచేశారు. 

‘మీరు గొప్ప ఆర్టిస్టు. మిమ్మల్ని అభిమానించేవాళ్ళు ఎందరో ఉన్నారు. దయచేసి ఈ కుళ్ళు రాజకీయాల్లోకి మాత్రం రావద్దు’అని మా అమ్మాయి పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళినపుడు చెప్పాను. అప్పుడు ఆయన నవ్వేసి ఊరుకున్నారని జమున వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అది చేస్తాం ఇది చేస్తాం అంటే జరిగే పని కాదని కూడా ఆమె అన్నారు. సరిగ్గా అదే జరిగిందన్నారు. తాజాగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి పోటీచేశారు. పవన్ కి కూడా ఓటమి తప్పలేదు.