Teachers Day

టీచర్స్‌ డే ఎందుకు జరుపుకుంటారు?

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్… ప్రతీ ఏటా ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న అందరూ స్మరించుకునే పేరు. ఆయన పుట్టిన రోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చాలామందికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన మొదట ఉపాధ్యాయుడు. విద్యావేత్త. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1882 సెప్టెంబర్ 5న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి పూర్వీకులది నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి. అందుకే ఇంటిపేరు కూడా సర్వేపల్లిగా మారింది. ఆయన అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుత్తణిలో జన్మించారు.

స్వాతంత్ర్యం తర్వాత తొలి ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు. పదేళ్లు ఉపరాష్ట్రపతిగా సేవలందించిన తర్వాత రాష్ట్రపతి పదవి వరించింది. ఆయన రాష్ట్రపతి పదవిని అలంకరించింది 1962లో. ఓ ఉపాధ్యాయుడు రాష్ట్రపతి పదవిలో కూర్చోవడం ఆ వృత్తికే గర్వకారణం. అందుకే 1962 నుంచి ఆయన పుట్టిన రోజునే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. వాస్తవానికి రాధాకృష్ణన్‌కు పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం లేదు. అందుకే తన పుట్టిన రోజును టీచర్స్‌డేగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు. సమాజానికి సేవలు చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఇది గౌరవంగా భావించారాయన.

డాక్టర్ రాధాకృష్ణన్ మానవతావాది. యువతకు ఆదర్శమూర్తి. ఆయనకు 1931లోనే భారతరత్న పురస్కారం లభించింది. నోబెల్ శాంతి బహుమతికి ఏకంగా 11 సార్లు నామినేట్ కావడం మరో విశేషం. రాధాకృష్ణన్ అన్నా, ఆయన బోధనలన్నా విద్యార్థులకు ఎంతో ఇష్టం. విద్యార్థులకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. అందుకే టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన పుట్టినరోజును మించిన మంచి రోజు లేదనే చెప్పాలి. ప్రతీ ఏటా సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతితో పాటు టీచర్స్ డేని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం అలవాటు. ఈ రోజున పిల్లలు తమ తమ ఉపాధ్యాయులపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. బహుమతులు అందజేస్తుంటారు.