Movies

గురువులుగా మెప్పించిన స్టార్ హీరోయిన్స్ …ఎంత మంది ఉన్నారో తెలుసా ?

తల్లి,తర్వాత తండ్రి.. ఈ ఇద్దరి తర్వాత మనిషి జీవితాన్ని మలుపు తిప్పేది గురువు. భారతీయ సంప్రదాయంలోనే గురువుకి ఓ విశిష్ట స్థానం ఉంది. ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, విద్య ఇస్తే చాలానే సామెత కూడా ఉండనే ఉంది. మన సమాజంలో ఇంకా గురువుకి విశిష్ట స్థానం ఉంది. అయితే అలనాడు ఎన్టీఆర్ బడిపంతులు సినిమాలో మాస్టారుగా చేసిన పాత్ర ఇప్పటికీ చాలామంది మదిలో మెదులుతూనే ఉంటుంది. రెబెల్ స్టార్ కృష్ణంరాజు శిష్యుడిగా చేసిన ఈ సినిమా గురుశిష్యుల బంధం చాటిచెప్పింది. అక్కినేని మొదలుకుని చాలామంది హీరోలు తెరపై గురువులుగా నటించి మెప్పించారు. అయితే హీరోయిన్స్ కూడా తామేమీ తక్కువ కాదని గురుబ్రహ్మల పాత్రలో నటించి మెప్పించారు.

మహానటి సావిత్రి మిస్సమ్మ చిత్రంలో టీచర్ గా కనిపించి, తన నటనతో వన్నె తెచ్చింది. అలాగే అప్పట్లో అందాల నటి జమున కూడా చలం నటించిన మట్టిలో మాణిక్యం చిత్రంలో టీచర్ గా కనిపించింది. ఇక పంతులమ్మ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మీ కూడా టీచర్ గా మెప్పించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆరాధన చిత్రంలో సుహాసిని టీచర్ గా నటించి మెప్పించింది. అభ్యుదయ దర్శకుడు టి కృష్ణ తీసిన రేపటి పౌరులు, అలాగే ప్రతిఘటన వంటి చిత్రాల్లో టీచర్ పాత్ర లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అదరగొట్టేసింది. ఈమె టీచర్ పాత్రకు ఓ క్రేజ్ తెచ్చిందని చెప్పాలి.

ఇక గ్లామర్ హీరోయిన్ రమ్యకృష్ణ కౌరవుడు మూవీలో టీచర్ గా నటించింది. ప్రేయసి రావే చిత్రంలో టీచర్ గా కనిపించింది రాశీ; ఆర్య హీరోగా నటించిన ‘నేనే అంబానీ’ చిత్రంలో నయనతార; వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఘర్షణ మూవీలో అసిన్, రవితేజ హీరోగా చేసిన ఖతర్నాక్ మూవీలో ఇలియానా; శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ మూవీ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా కమలినీ ముఖర్జీ; బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, ప్రేమమ్ సినిమాలో శృతి హాసన్; గోల్కొండ హైస్కూల్ చిత్రంలో ‘కలర్స్’ స్వాతి; వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ మూవీలో రాయ్ లక్ష్మీ గురువుగా కన్పించారు. ఇక అక్షర సినిమాలో నందిత శ్వేత ప్రొఫెసర్ గా చేసింది.