MoviesTollywood news in telugu

రామాయణంలోని రాముడు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా?

Arun Govil :లవకుశ, మాయాబజార్, శ్రీకష్ణ పాండవీయం , దాన వీర శూర కర్ణ లాంటి సినిమాలలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ ఒదిగిపోయి ఆడియన్స్ లో చెరగని ముద్రవేసుకున్నారు. అందునా రాముడు, కృష్ణుడు అంటే అచ్చం ఎన్టీఆర్ లాగే ఉంటారన్న రీతిలో జనం గుండెలో నిల్చిపోయారు. తెలుగులో ఎన్టీఆర్ ని మెప్పించేలా మరో హీరో రాబోరని చెప్పొచ్చు. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు గా ఎన్టీఆర్ శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.

ఇక సిల్వర్ స్క్రీన్ కాకుండా బుల్లితెర విషయానికి వస్తే, అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే ఉండేది. ఆరోజుల్లో రామానంద సాగర్ రామాయణ సీరియల్ ని తెరకెక్కించి, దూర దర్శన్ లో ప్రసారం చేయడంతో విశేష ఆదరణ చూరగొంది. రామాయణం ఆదివారం ఉదయం వస్తోందని తెల్సి చాలామంది ఇళ్ళు కడిగి ముగ్గులు పెట్టేవారు. ఇందులో రాముడుగా అరుణ్ గోవిల్ బాగా మెప్పించాడు. 1958 లో జన్మించిన అరుణ్ గోవిల్ రామాయణం ద్వారా యావత్ దేశంలో రాముడిగా వెలుగొందాడు.

అయితే విశ్వామిత్ర సీరియల్లో హరిశ్చంద్ర మహారాజు గా, బుద్ధ సీరియల్లో గౌతమ్ బుద్ధ పాత్ర కూడా చేశాడు. హిందీ, భోజ్ పూరి,ఒరియా, తెలుగు సినిమాలను కూడా చేసిన యితడు లవకుశ సినిమాలో లక్ష్మణుడి పాత్ర చేశాడు. అలాగే నాగార్జున, శ్రీదేవి తో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన గోవింద గోవింద మూవీ లో అరుణ్ గోవిల్ వెంకటేశ్వర స్వామి పాత్ర వేసాడు. తర్వాత పెద్దగా ఛాన్స్ లయితే రాలేదు. కానీ బుల్లితెరపై పలు పాత్రలతో రాణిస్తున్నాడు. అన్నట్టు లాక్ డౌన్ సమయంలో దూరదర్శన్ లో రామాయణం ప్రసారం కావడం, టాప్ టీఆర్పీ లోకి వెళ్లడంతో అరుణ్ గోవిల్ మళ్ళీ అందరి మదిలో మెదిలాడు.