యూట్యూబ్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకి వచ్చి హిట్ కొట్టిన స్టార్స్
Youtube Stars In Telugu :ఒకప్పుడు సినిమాలోకి వెళ్లాలంటే చాలా కష్టపడాలి. ఎన్నో ఇబ్బందులు పడుతూ నిర్మాతల చుట్టూ, స్టూడియోల చుట్టూ పడిగాపులు పడాల్సి వచ్చేది. అయితే సోషల్ మీడియా వచ్చాక ఎవరి టాలెంట్ ని వాళ్ళు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. అందులో ముఖ్యంగా యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్,వెబ్ సిరీస్ తో చాలామంది తమ నటనను ప్రదర్శించి టాలెంట్ చాటుకుంటున్నారు. ఆవిధంగా యూట్యూబ్ ద్వారా స్టార్ స్టేటస్ తెచ్చుకుని తర్వాత వెండితెరమీదికి వచ్చి,సెలబ్రిటీస్ గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
సంకల్ప రెడ్డి మొదట షాట్ ఫిలిమ్స్ చేసి, తర్వాత ఘాజి సినిమా రెడీ చేసుకుని రానాతో చేసాడు. పలు షార్ట్ ఫిలిమ్స్ లో చేసిన రాజ్ తరుణ్ ని చూసి, డైరెక్టర్ విరించి వర్మ ఉయ్యాలా జంపాల మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. వైవా షోతో యూట్యూబ్ లో పాపులర్ గా మారిన హర్ష వరుస ఛాన్స్ లతో సినిమాల్లో కమెడియన్ గా దూసుకొచ్చాడు. డైరెక్టర్ సుజిత్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి, తర్వాత ఓ కథ లైన్ మార్చి రన్ రాజా రన్ మూవీ చేసాడు. తరువాత ప్రభాస్ తో సాహో చేసాడు. పెళ్లి చూపులు వంటి సూపర్ హిట్ మూవీ డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ మొదట్లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసాడు.
కలర్ ఫోటో మూవీతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రాజు యూట్యూబ్ లో చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసాడు. ఈ సినిమా హీరోయిన్ చాందిని చౌదరి కూడా బెంగళూరులో చదివేటప్పుడు షార్ట్ ఫిలిమ్స్ లో చేసింది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో చేసిన సుదర్శన్ కమెడియన్ గా టాలీవుడ్ లో బిజీ అయ్యాడు. యూట్యూబ్ లో మిస్డ్ కాల్ అనే షార్ట్ ఫిలిం తో పాపులర్ అయిన డైరెక్టర్ అనుదీప్ జాతిరత్నాలు మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. నవీన్ పోలిశెట్టి కూడా పలు షార్ట్ ఫిలిమ్స్ లో చేసాడు.

