MoviesTollywood news in telugu

రెండేళ్ల పాటు ఒకే చొక్కా ఉతక్కుండా వాడిన మెగాస్టార్…ఎందుకో తెలుసా ?

ఇలాంటివి ప్రస్తావిస్తుంటే, చాలామందికి ఆశ్చర్యం వేయడమే కాదు, ఏదో రూమర్ లా ఉందేమో అనుకుంటారు. ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో ఏంటి.. ఒక్క చొక్కాను రెండేళ్లు వేసుకోవడం ఏంటి.. పైగా ఉతకకుండా వేసుకోవడమా నవ్విపోతారు ఎవరైనా అని అనేస్తారు. కానీ ఇది నిజం. ఎందుకంటే, సినిమాల్లో ఉన్నపుడు అలాంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి.

చిరంజీవి లైఫ్‌లో కూడా ఇలాంటి ఘటన ఉంది. నిజంగానే ఓ చొక్కా రెండేళ్ల పాటు వేసుకున్నాడు. మరకలు పోనీకుండా.. ఎలా ఉందో అలాగే జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఆ చొక్కా ఫ్లాష్ బ్యాక్‌లో పెద్ద కథ ఉంది. మెగా కెరీర్‌లో భారీ అంచనాలతో తీసిన అంజి సినిమా అత్యంత దారుణంగా నిరాశ పరిచింది. భారీ బడ్జెట్‌తో కోడి రామకృష్ణ తెరకెక్కించాడు.

ఈ చిత్రం అప్పట్లో చాలా ఏళ్లపాటు సెట్స్‌పైనే ఉంది. దాదాపు ఐదేళ్ళ పాటు ఆగుతూ సాగుతూ పడుతూ లేస్తూ మొత్తానికి అయిందనిపించింది.ఎంతో కష్టపడి గ్రాఫికల్ వండర్‌గా ఈ సినిమాను కోడి రామకృష్ణ తీస్తే, ఫలితం మాత్రం ఊహించిన విధంగా రాలేదు. 2004 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అంచనాలు అందుకోకపోయినా, గ్రాఫిక్స్ పరంగా రికార్డులు తిరగరాసింది.

అదే పండక్కి వచ్చిన లక్ష్మీ నరసింహా, వర్షం సినిమాల చేతిలో అంజి ఓడిపోయింది. అయితే నేషనల్ అవార్డు కూడా అందుకుంది. నిజానికి అంజి సినిమా చేయడం దర్శకుడికి యిష్టం లేదు. కానీ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం చిరంజీవితో ఓ భారీ గ్రాఫికల్ సినిమా చేయాలనే పట్టుదలతో అంజి వచ్చేలా చేసాడు. కోడి రామకృష్ణ తన దగ్గర చిరంజీవికి సరిపోయే డ్యూయల్ రోల్ కథ ఒకటి ఉంది. కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుంది, అది చేద్దామని చెప్పినా కూడా ఎవ్వరూ వినలేదు.

చివరికి అంజి సినిమా ఒప్పుకుంటే, ఈ చిత్రం షూటింగ్ అనుకోని విధంగా మూడు నాలుగేళ్లకు పైగానే సాగింది. ఇంతకీ ఈ సినిమా సందర్బంగా దర్శకుడు కోడి రామకృష్ణ ఒక్క క్లైమాక్స్ మాత్రమే రెండేళ్ల పాటు తీసాడు. దీంతో క్లైమాక్స్‌లో చిరంజీవి వేసుకునే చొక్కా రెండేళ్ల పాటు అలాగే ఉతకకుండా ఉంచాల్సి వచ్చిందట.

ఈ విషయాన్ని అప్పట్లో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంత పెద్ద హీరో అయినా కూడా కొత్త హీరోలా అంజి కోసం కష్టపడ్డాడని.. కానీ ఈ చిత్రం ఫలితం నిరాశ పరిచిందని చెప్పాడు. కానీ ఫ్లాప్ అయినా కూడా తనకు, చిరంజీవికి అంజి మరుపురాని సినిమా అని చెప్పుకొచ్చాడు.