Ragi Chimmili: పాతకాలము నాటి “రాగి చిమిలి”.. ఎముకల్ని ఉక్కులా దృఢంగా చేసి రక్తహీనత లేకుండా చేస్తుంది
Ragi Chimmili: పాతకాలము నాటి “రాగి చిమిలి”.. ఎముకల్ని ఉక్కులా దృఢంగా చేసి రక్తహీనత లేకుండా చేస్తుంది.. రాగితో చేసే వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.
రాగి చిమిలి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది సాంప్రదాయ రెసిపీ, పెద్దలకైనా, పిల్లలకైనా ఎముకలు బలోపేతం కావడానికి, రక్తం ఉత్పత్తి కావడానికి, బలహీనంగా ఉన్నవారిలో నీరసం తొలగి బలం పెరగడానికి ఈ రాగి చిమిలి చాలా ఉపయోగకరం. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మీ ఇంట్లోనే ఈ రుచికరమైన రాగి చిమిలిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం క్రింద చూడండి.
రాగి చిమిలి తయారీకి కావాల్సిన పదార్థాలు:
రాగి పిండి
పల్లీలు
నెయ్యి
నువ్వులు
బెల్లం
రాగి చిమిలి తయారీ విధానం:
ఒక గిన్నెలో ఒక గ్లాసు రాగి పిండి తీసుకొని, అందులో చిటికెడు ఉప్పు కలిపి, కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోండి. దాన్ని మూడించి పావుగంట పాటు నాననివ్వండి.ఒక బాండీలో ముప్పావు గ్లాసు పల్లీలను వేసి వేయించి, చల్లారనివ్వండి.అదే బాండీలో పావు గ్లాసు నువ్వులను వేయించి, చల్లారనివ్వండి.
స్టవ్‌పై పెనం పెట్టి, నానిన రాగి పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని, అరటి ఆకుపై చపాతీలా వత్తుకొని, నెయ్యితో రెండు వైపులా కాల్చి, చల్లారనివ్వండి.చల్లారిన పల్లీల పొట్టు తీసేసి, మిక్సీలో బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే నువ్వులను కూడా గ్రైండ్ చేసి ఉంచండి.
చల్లారిన రాగి చపాతీలను ముక్కలుగా చేసి, మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి.మిక్సీలో ముప్పావు గ్లాసు బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.ఇప్పుడు గ్రైండ్ చేసిన రాగి పిండి, పల్లీలు, నువ్వులు, బెల్లం మిశ్రమాలను కలిపి, కొద్దిగా ఇలాచీ పొడి వేసి బాగా కలపండి.
ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేయండి. అంతే, రాగి చిమిలి సిద్ధం! రోజూ ఒక్కటి తింటే ఆరోగ్యం బాగుంటుంది.ఈ రెసిపీ సులభమైనది మరియు ఆరోగ్యకరమైనది. రోజూ ఒక రాగి చిమిలి తినడం వల్ల శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

