Kitchenvantalu

Sajjala Laddu: రోజుకో “సజ్జల లడ్డు” తినండి చాలు, నీరసమే రాదు..

Sajjala Laddu:సజ్జలు ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం. సజ్జలతో తయారు చేసే లడ్డూలు రుచికరమే కాక, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి రోజున ఈ లడ్డూలను ప్రసాదంగా సమర్పిస్తారు.

ఒకప్పుడు మన పూర్వీకులు ఈ లడ్డూలు తిని బలంగా ఉండేవారు. పిల్లలు కూడా ఈ రుచికరమైన లడ్డూలను ఇష్టపడతారు. ఇంట్లోనే సులభంగా తయారు చేయగల ఈ టేస్టీ, హెల్దీ సజ్జ లడ్డూ విధానాన్ని ఇక్కడ తెలుసుకోండి.

సజ్జ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు:
– సజ్జలు
– పల్లీలు
– నెయ్యి
– నువ్వులు
– ఎండు కొబ్బరి
– యాలకులు
– తాటి బెల్లం లేదా సాధారణ బెల్లం

తయారీ విధానం:
1. ఒక కప్పు సజ్జలను ఒక గిన్నెలో వేసి, రెండు సార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి 5-6 గంటలు నానబెట్టండి.

2. నానిన సజ్జలను వడగట్టి, నీరు పూర్తిగా పోయేలా పల్చని గుడ్డపై వేసి నీడలో ఆరనివ్వండి.

3. ఆరిన సజ్జలను ఒక పాన్‌లో వేసి, తక్కువ మంటపై నూనె లేకుండా కరకరలాడే వరకు వేయించి, ఒక గిన్నెలోకి తీసి చల్లారనివ్వండి.

4. అదే పాన్‌లో అర కప్పు పల్లీలను తక్కువ మంటపై వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వండి.

5. అదే పాన్‌లో పావు కప్పు నువ్వులను వేసి, చిటపటలాడే వరకు వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వండి.

6. చల్లారిన సజ్జలను, 4 యాలకలను మిక్సీలో వేసి, మధ్యమధ్యలో ఆపుతూ మెత్తగా గ్రైండ్ చేసి, ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టండి.

7. ఇప్పుడు మిక్సీలో వేయించిన నువ్వులు, పల్లీలు, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలను వేసి, కొద్దిగా పలుకులుగా గ్రైండ్ చేయండి. ఈ పొడిని సజ్జ పిండిలో కలపండి.

8. ఈ మిశ్రమంలో ముప్పావు కప్పు తురిమిన తాటి బెల్లం లేదా సాధారణ బెల్లం వేసి బాగా కలపండి.

9. ఈ మిశ్రమాన్ని మళ్లీ మిక్సీలో వేసి, ముద్దగా అయ్యే వరకు గ్రైండ్ చేయండి. ఈ పొడిని ఒక ప్లేట్‌లోకి తీసి బాగా కలపండి.

10. ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపండి. చిన్న చిన్న భాగాలుగా తీసుకొని లడ్డూలుగా చుట్టండి.

అంతే, రుచికరమైన, ఆరోగ్యకరమైన సజ్జ లడ్డూలు సిద్ధం!