Onion samosa:కేవలం 15 నిమిషాల్లో “ఉల్లిపాయ సమోసా” క్రిస్పీ గా మంచి రుచిగా ఇలా సింపుల్ గా చేసేయండి
Onion samosa:సమోసా అంటే తెలియని భారతీయులు ఎవరూ ఉండరు. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో దీనిని రుచి చూసే ఉంటారు. అయితే, చాలామంది సమోసాలను స్ట్రీట్ షాపుల్లో, బేకరీల్లో లేదా ప్రయాణాల్లో అమ్మేవారి దగ్గర కొని తింటారు.
వాస్తవానికి, ఆఫీసుల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు సాయంత్రం స్నాక్‌గా సమోసాను ఇష్టపడతారు, ముఖ్యంగా ఉల్లిపాయ సమోసా దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందగా, ఉత్తర భారతదేశంలో ఆలూ సమోసా ఎక్కువగా తింటారు.
దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా లభించే ఉల్లిపాయ సమోసాను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రోడ్డు పక్కన కొనే సమోసాల కంటే రుచిలో రెట్టింపు ఆనందాన్ని పొందవచ్చు. ఇంట్లో ఉల్లిపాయ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.
ఉల్లిపాయ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు
– మైదా పిండి
– నీరు
– ఉల్లిపాయలు
– పచ్చిమిర్చి
– చాట్ మసాలా
– కొత్తిమీర
– కారం
– ఉప్పు
– నూనె
ఉల్లిపాయ సమోసా తయారీ విధానం
1. ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల మైదా పిండి తీసుకోండి.
2. మైదా పిండిలో కొద్దిగా నూనె, ఉప్పు వేసి బాగా కలపండి. ఆ తర్వాత కొద్దిగా నీరు పోసి కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని సెమీ సాఫ్ట్‌గా ఉండేలా 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
3. ఆ తర్వాత పిండిని చపాతీ కర్రతో పలుచగా చపాతీలా చుట్టండి.
4. స్టవ్ మీద పాన్ పెట్టి, చపాతీని రెండు వైపులా లేతగా కాల్చి, పక్కన పెట్టుకోండి.
5. ఇప్పుడు మరో గిన్నెలో 2 స్పూన్ల మైదా పిండి, కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా కలపండి.
6. కాల్చిన చపాతీలను ఒకదానిపై ఒకటి ఉంచి, అన్ని వైపులా కట్ చేసి చతురస్రాకారంలో (స్క్వేర్ షేప్) తయారు చేయండి. ఆ తర్వాత వాటిని రెండు సమాన భాగాలుగా కట్ చేయండి.
7. చపాతీలను కత్తిరించినప్పుడు మిగిలిన అంచులను (ఎడ్జెస్) నూనెలో క్రిస్పీగా వేయించి పక్కన పెట్టుకోండి.
8. స్టఫింగ్ కోసం, ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కారం, ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలపండి. ఇందులో వేయించిన చపాతీ అంచుల ముక్కలను కొన్ని కలపండి.
9. చతురస్రాకారంలో కట్ చేసిన చపాతీ ముక్కను తీసుకొని, సమోసా ఆకారంలో చుట్టండి. మధ్యలో స్టఫింగ్ పెట్టి, మైదా-నీటి మిశ్రమంతో అంచులను అతికించండి.
10. నూనెలో సమోసాలను వేయించండి. లేత గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించి, క్రిస్పీ ఉల్లిపాయ సమోసాలను సర్వ్ చేయండి.
ఇలా ఇంట్లో తయారు చేసిన సమోసాలు రుచికరంగా, క్రిస్పీగా ఉంటాయి!

